LOADING...
Allu arjun: అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు.. ట్రోల్స్‌ జయించి ట్రెండ్‌సెట్టర్‌గా ఎదిగిన స్టార్
అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు.. ట్రోల్స్‌ జయించి ట్రెండ్‌సెట్టర్‌గా ఎదిగిన స్టార్

Allu arjun: అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు.. ట్రోల్స్‌ జయించి ట్రెండ్‌సెట్టర్‌గా ఎదిగిన స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ అనే పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. అదే "మల్లు అర్జున్" అని వినగానే కేరళ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. "ఇతను హీరోనా?" అనే సందేహం నుంచి "హీరో అంటే ఇతనే" అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి బన్నీ. ప్రముఖ నిర్మాత కుమారుడిగా, అగ్ర హీరోకు మేనల్లుడిగా బాధ్యతలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన, కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోగా ఆయన నిలిచాడు.

వివరాలు

స్వాతిముత్యంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా..

1982 ఏప్రిల్‌ 8న చెన్నైలో అల్లు అరవింద్‌, నిర్మల దంపతులకు జన్మించిన అల్లు అర్జున్‌ చిన్నప్పటి నుంచి 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. తన విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తి చేశాడు. తాతగా ప్రముఖ హాస్యనటుడు రామలింగయ్య, మామయ్యగా మెగాస్టార్ చిరంజీవి, తండ్రిగా అగ్ర నిర్మాత ఉన్న నేపథ్యం ఆయన సినీ ప్రవేశానికి దోహదపడింది. 2003లో దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు బాలనటుడిగా 'విజేత', 'స్వాతిముత్యం' చిత్రాల్లో కనిపించడం, 'డాడీ' సినిమాలో డ్యాన్స్ చేయడం ఆయనకు ప్లస్ అయ్యాయి.

వివరాలు

ట్రోల్స్‌కు ఇచ్చిపడేసిన స్టార్..

'గంగోత్రి' విడుదల సమయంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా, లుక్ విషయంలో విమర్శలు, ట్రోల్స్ ఎదురయ్యాయి. అయితే వాటిని పట్టించుకోకుండా తనలో మార్పులు చేసుకున్నాడు. ఆ మార్పుల ఫలితమే 'ఆర్య'. ఆ చిత్రంతో పూర్తిగా కొత్త లుక్, స్టైల్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. చిరంజీవి నుంచే ఉత్తమ డాన్సర్‌గా ప్రశంసలు అందుకున్న బన్నీ, 'గంగోత్రి', 'ఆర్య', 'బన్నీ' సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన హీరోల్లో ఆయన ఒకరు. 'హ్యాపీ' సినిమా నిరాశపరిచినా, 'దేశముదురు'తో ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ చూపించిన తొలి హీరోగా గుర్తింపు పొందాడు. తరువాత 'పరుగు'లో తన నటనను మరోసారి నిరూపించాడు.

Advertisement

వివరాలు

పారితోషికం తీసుకోకుండా చేసిన పాత్ర..

'వరుడు', 'వేదం', 'బద్రినాథ్', 'జులాయి', 'దువ్వాడ జగన్నాథం', 'రుద్రమదేవి' వంటి చిత్రాల ద్వారా తనలోని వైవిధ్యాన్ని చూపించాడు. ముఖ్యంగా 'వేదం' సినిమాలో తన పాత్ర చివరలో మరణించే పాత్ర అయినప్పటికీ దాన్ని అంగీకరించడం ఆయన ధైర్యాన్ని చూపించింది. అలాగే 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డి పాత్రను పారితోషికం లేకుండా చేసి, ఆ చిత్రానికి మరింత పేరు తీసుకొచ్చాడు. డ్యాన్స్ అంటే అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన ఆసక్తి. తన గదిలో మైకేల్ జాక్సన్, చిరంజీవి ఫోటోలు మాత్రమే ఉండేవని, వారిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన చెప్పాడు. మైకేల్ జాక్సన్‌పై బన్నీకి అభిమానం ఉంది. ఆయన మరణించినప్పుడు నివాళిగా స్టేజ్ ప్రదర్శన కూడా ఇచ్చాడు. 'పుష్ప'లోని 'శ్రీవల్లి' పాటలోని చెప్పు జారే స్టెప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

Advertisement

వివరాలు

ఆ మూవీ కోసం కత్తి యుద్ధం ట్రైనింగ్..

ప్రయోగాత్మక కథలంటే బన్నీకి ప్రత్యేక ఇష్టం. పాత్ర చిన్నదైనా, కథ బలంగా ఉంటే నటించడానికి వెనుకాడడు. 'రుద్రమదేవి'లో అతిథి పాత్ర అయినా గోనగన్నారెడ్డి పాత్ర చేశాడు. 'వేదం'లో కేబుల్ రాజు పాత్రతో కొత్త కోణాన్ని చూపించాడు. అయితే ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదని, 'నా పేరు సూర్య' ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా కోసం ఎంత కష్టపడతాడో దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ పలుమార్లు చెప్పారు. 'పుష్ప' కోసం ఏడాది పాటు చిత్తూరు యాస సాధన చేశాడు. 'బద్రినాథ్' కోసం విదేశాల్లో కత్తియుద్ధం నేర్చుకున్నాడు. 'రుద్రమదేవి' కోసం తెలంగాణ యాస నేర్చుకున్నాడు.

వివరాలు

తగ్గేదేలే అంటూ ప్రజల్లోకి..

మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన సొంత శ్రమతో ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. మలయాళంలో కూడా ఆయనకు విశేషమైన అభిమానులు ఉన్నారు. అక్కడ ఆయనను "మల్లు అర్జున్" అని పిలుస్తారు. 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ చెప్పిన "తగ్గేదే లే" డైలాగ్ ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. సినిమా, క్రీడ, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా దాన్ని ఉపయోగించారు. ఈ స్థాయికి ఆయన చేరడానికి ప్రధాన కారణం ఆయన టాలెంట్. మంచి కంటెంట్‌తో పాటు ప్రతిభ ఉంటే ఎక్కడైనా విజయమే అన్నది ఆయన ప్రయాణం చెబుతోంది.

Advertisement