అల్లు అర్జున్, శ్రీలీల కలిసి కనిపించిన వీడియో ఆహాలో రిలీజ్: ఇంతకీ ఆ వీడియో ఏంటంటే?
అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఆహా కోసం వచ్చేస్తున్నారని రెండు మూడు రోజులుగా వరుసపెట్టి ట్వీట్లు పెట్టింది ఆహా టీమ్. ఆహా ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ హంగామా మొదలెట్టి ఆసక్తిని పెంచింది. దీంతో అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఆహా కోసం ఏదైనా డ్యాన్స్ వీడియో చేయబోతున్నారని అనుకున్నారు. కొందరైతే వీరిద్దరూ కలిసి ఏదైనా సిరీస్ చేయబోతున్నారేమో అనుకున్నారు. ప్రస్తుతం ఆహా వెల్లడి చేసిన విషయం ఏంటంటే, ఆహా కోసం అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఒక ప్రమోషనల్ వీడియో చేసారు. ఈ వీడియోను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం విశేషం. ఆహాలో సినిమాలు, సిరీస్ లు, యాక్షన్, డ్రామా, డ్యాన్స్ ప్రతీదీ ఉందంటూ ప్రమోషనల్ వీడియోలో ఎంటర్ టైనింగ్ గా చూపించారు.
అర్జున్ లీల అనే టైటిల్ తో ప్రమోషనల్ వీడియో
ఈ ప్రమోషనల్ యాడ్ కోసం భారీగానే ఖర్చు అయినట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియోకు అర్జున్ లీల అనే పేరు పెట్టారు. నిన్న సాయంత్రం ఈ వీడియోకు సంబంధించిన గ్లింప్స్ రిలీజైంది. ఈరోజు ఉదయం ఆహాలో మాత్రమే అర్జున్ లీల వీడియోను రిలీజ్ చేసారు. మొత్తానికి ఆహా క్రియేట్ చేసిన సస్పెన్స్ బాగానే వర్కౌట్ అయ్యింది. అదలా ఉంచితే, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకంలో అల్లు అర్జున్ సినిమా ఉండనుంది. ఇక శ్రీలీల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయినా కూడా ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయని సమాచారం.