దర్శకుల ఫ్యాక్టరీగా జబర్దస్త్: సాయి కుమార్ తో సినిమాను రెడీ చేస్తున్న కమెడియన్
తెలుగు టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్, దర్శకుల ఫ్యాక్టరీగా మారిపోయిందేమో అనిపిస్తుంది. జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్ గా చేసిన ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా దర్శకులుగా మారుతున్నారు. జబర్దస్త్ మొదలైన కొత్తలో టీమ్ లీడర్ గా పనిచేసి, ఆ తర్వాత బయటకు వచ్చి బలగం సినిమాను తెరకెక్కించి బాహుబలి రేంజ్ లో హిట్ అందుకున్నాడు దర్శకుడు వేణు. ప్రస్తుతం జబర్దస్త్ శాంతికుమార్, దర్శకుడిగా మారబోతున్నాడు. సీనియర్ నటులు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నాతో నేను అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఓసినీ వయ్యారి రామ చిలక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటను సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ విడుదల చేసారు.
పాటలు, మాటలు అన్నీ తానై
సున్నితమైన అంశాలతో నిండిపోయిన ఈ చిత్రం, ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, కొన్ని పాటలు కూడా తానే అందిస్తున్నట్లు శాంతి కుమార్ చెప్పుకొచ్చారు. సాంగ్ లాంచ్ వేడుకలో మాట్లాడిన శాంతి కుమార్, ఇన్నిరోజులు జబర్దస్త్ కమెడియన్ గా ఆదరించారు, ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేస్తూ దర్శకుడిగా మారుతున్నా, దర్శకుడిగానూ తనని ఆదరించాలని కోరుకుంటున్నట్లు శాంతి కుమార్ అన్నాడు. ఈ సినిమాలో సాయి కుమార్ తో పాటు శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, దీపాలి రాజ్ పుత్, ఐశ్వర్య నటిస్తున్నారు. టంగుటూరి ప్రశాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.