Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు మరో డిఫరెంట్ ప్రాజెక్ట్.. శౌర్యువ్ స్క్రిప్ట్‌లో పౌరాణిక టచ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో సంచలన స్టార్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ వరుసగా కొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం 'రౌడీ జనార్ధన', 'రణబలి' వంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 'హాయ్ నాన్న'చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈఇద్దరి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన సినిమా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శౌర్యువ్ సిద్ధం చేసిన కథలో మైథాలజికల్ అంశాలు మిళితమై ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక టచ్‌తో కూడిన ఒక వినూత్నమైన సోషియో-ఫాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Details
విజయ్ అభిమానులకు అది పెద్ద సర్‌ప్రైజ్
విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ కథ ఉండటం వల్లే ఆయన ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రాలైన 'రణబలి', 'రౌడీ జనార్ధన' షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్ని అనుకూలిస్తే, శౌర్యువ్‌తో చేయబోయే ఈ కొత్త చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తే విజయ్ అభిమానులకు అది పెద్ద సర్‌ప్రైజ్‌గా మారనుంది. తన రెండో సినిమాకే విజయ్ దేవరకొండతో పనిచేసే అవకాశం దక్కించుకున్న శౌర్యువ్ ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాల్సి ఉంది.