
Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..?
ఈ వార్తాకథనం ఏంటి
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నారని సమాచారం.
ఈ యువ నటుడి తొలి సినిమా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి చేపట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.
వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న అవకాశం ఉందని కథనాలు వెల్లడి చేస్తున్నాయి.
జయకృష్ణ ఇప్పటికే ఫొటోషూట్‌లో పాల్గొన్నారని, నటనతో పాటు మరికొన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నారని తెలిసింది.
Details
జయకృష్ణ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి
జయకృష్ణ తండ్రి రమేశ్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 'అల్లూరి సీతారామరాజు', 'మోసగాళ్లకు మోసగాడు', 'దేవుడు చేసిన మనుషులు' వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
ఆపై 'నా ఇల్లే నా స్వర్గం', 'అన్నా చెల్లెలు', 'పచ్చతోరణం', 'సామ్రాట్', 'కృష్ణగారి అబ్బాయి' తదితరంగా మొత్తం 17 చిత్రాల్లో కథానాయకుడిగా కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాదు, రమేశ్‌బాబు తన తమ్ముడు మహేశ్‌బాబుతో కలిసి 'అర్జున్', 'అతిథి' చిత్రాలను నిర్మించారు. 2022లో అనారోగ్యంతో రమేశ్‌బాబు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
ఆయన వారసుడిగా జయకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న ఈ పరిణామం ఘట్టమనేని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.