Devara: 'అభిమానులకు క్షమాపణలు'.. 'దేవర' ఈవెంట్ రద్దుపై నిర్వాహకుల వివరణ
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు విషయంపై నిర్వాహకులు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈవెంట్‌ను హోటల్ వేదికగా మార్చాల్సిన కారణాలు, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ మీద మీరందరూ చూపిస్తున్న అపారమైన అభిమానాన్ని, ప్రేమను తాము గమనించామన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించనున్న నేపథ్యంలో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని, ప్రస్తుత పరిణామాలతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారని చెప్పారు.
అభిమానుల భద్రత దృష్ట్యా ఈవెంట్ రద్దు
ఈవెంట్‌ను బహిరంగ ప్రదేశంలో నిర్వహించాలని అనుకున్నా వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హోటల్ వేదికగా మార్చాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో పాస్‌లు అధికంగా పంపిణీ చేశారన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. తమ ఈవెంట్‌కు 30-35 వేల మంది హాజరయ్యారు. అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో గేట్లు కిక్కిరిసిపోయాయని, అభిమానుల భద్రత దృష్ట్యా ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. .
ఈవెంట్ రద్దు కావడం బాధాకరం : జాన్వీ కపూర్
నిర్వాహకులు గతంలో రెండు లక్షల మందితో నిర్వహించిన ఈవెంట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయన్నారు. ఈ సారి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా లైవ్ కార్యక్రమాలను కూడా 100కి పైగా యూట్యూబ్ చానల్స్ ద్వారా ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈవెంట్‌కు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలో మరింత బలంగా తిరిగి వస్తామన్నారు. 'దేవర' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంపై జాన్వీ కపూర్ కూడా బాధను వ్యక్తం చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.