AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా, ప్రధాన వార్తా సంస్థలు తన కుటుంబం, విడాకులపై అసత్యాలను ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసత్య సమాచారం, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆయన తరఫు న్యాయవాది నర్మదా సంపత్ ద్వారా బహిరంగ నోటీసు విడుదల చేశారు. అన్నీ 24 గంటల్లోగా తొలగించకపోతే, భారత న్యాయశాస్త్రంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. తనపై అసత్య ప్రచారం కొనసాగితే తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పరస్పర అంగీకారంతో విడాకులు
ఇటీవలి కాలంలో రెహమాన్ తన భార్య సైరా బాను ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తొలుత సైరా బాను తరఫు న్యాయవాది వందనా షా వెల్లడించగా, తర్వాత రెహమాన్ కూడా దీనిని నిర్ధారించారు. ఇది వారి జీవితంలో అత్యంత కఠినమైన దశ అని ఇద్దరూ వ్యక్తపరిచారు. అయినా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు అసత్యాలు ప్రచారం చేయడంపై రెహమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలతో పాటు న్యూస్ మీడియాకు కూడా అసత్య ప్రచారం కంటెంట్ తొలగించాలని నోటీసు పంపారు.