Bhogi Movie: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి.. సంపత్ నంది సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'భోగి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తన గత సినిమాల తరహాలో కాకుండా ఓ కొత్త దర్శకుడిలా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించానని ఆయన తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు భీమ్స్‌తో తనకు గ్యాప్ రావడం వెనుక ఇతరుల ప్రమేయం ఉందంటూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కథ, తెరవెనుక విశేషాలను ప్రీ రిలీజ్ వేడుకలో పంచుకున్నారు.
వివరాలు
శర్వానంద్‌కు జాతీయ అవార్డు రావాలి
హీరో శర్వానంద్ నటనపై సంపత్ నంది ప్రశంసలు కురిపించారు. ఈ కథను మొదటిసారిగా చెప్పిన హీరో శర్వానంద్ మాత్రమేనని, ఆయన కేవలం 20నిమిషాల్లోనే సినిమాకు ఓకే చెప్పారని వెల్లడించారు.
ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో శర్వానంద్ చేసిన నటన గత పదేళ్లలో చేయలేదు. రాబోయే పదేళ్లలో కూడా ఎవరూ చేయలేరేమో! బకెట్లతో రక్తం పోసుకోమన్నా, బురదలో దూకమన్నా ఏమాత్రం ఆలోచించకుండా చేశారు.
ఈ సినిమాకు శర్వానంద్‌కు కచ్చితంగా జాతీయ అవార్డు రావాలి. సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాత శర్వా రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేశారు.
మా అమ్మ నాకు జన్మనిస్తే, మీరు మరో జన్మనిచ్చారని చెప్పారు. ఆ మాట నాకు ఏ అవార్డుకైనా మించిన ఆనందాన్నిచ్చిందని సంపత్ నంది భావోద్వేగానికి గురయ్యారు.
వివరాలు
డింపుల్ హయాతికి క్షమాపణలు
హీరోయిన్ డింపుల్ హయాతి గురించి కూడా దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు కథ చెప్పినప్పుడు ఎలాంటి స్కిన్ షో, వల్గర్ మూమెంట్స్ లేకుండా అద్భుతమైన పాటను తెరకెక్కిస్తానని మాటిచ్చినట్లు తెలిపారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాటను చేయలేకపోయామని చెప్పారు. అందుకు వేదికపైనే డింపుల్‌కు సారీ చెబుతున్నా. కచ్చితంగా నా తదుపరి సినిమాలో ఆ మాట నిలబెట్టుకుంటానని సంపత్ నంది హామీ ఇచ్చారు.
వివరాలు
అనుపమపై ప్రశంసలు.. ఎమోషనల్ సాంగ్‌పై ఛాలెంజ్
మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటనను కూడా సంపత్ నంది ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎలాంటి డైరెక్షన్ అవసరం లేకుండానే చీర కట్టుకుని, గిన్నెలు తోముతూ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిందని కొనియాడారు.
ఇక సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఓ ఎమోషనల్ పాట గురించి దర్శకుడు ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఆ పాటను గీత రచయిత చంద్రబోస్ స్వయంగా రాజమండ్రికి వచ్చి వినిపించారని తెలిపారు. ఆ సమయంలో తాను, శర్వానంద్, నిర్మాత రాధామోహన్ కన్నీళ్లు పెట్టుకున్నామని చెప్పారు.
థియేటర్లలో ఆ పాట విన్నప్పుడు ప్రేక్షకుల కళ్లు చెమర్చకపోతే.. ఇకపై ఇలా అతిగా మాట్లాడటం తగ్గించుకుంటానని సంపత్ నంది ఛాలెంజ్ చెప్పారు.
వివరాలు
కొత్త దర్శకుడిగా 'భోగి'ని చూడండి
తన గత సినిమాలతో ఏర్పడిన ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రంగా 'భోగి'ని ప్రేక్షకులు ఆదరించాలని సంపత్ నంది కోరారు.
ఈ సినిమా విషయంలో తాను ఎంతో కష్టపడ్డానని చెబుతూ, మీడియా, ప్రేక్షకుల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు.