LOADING...
Mahesh Babu: విచారణకు హాజరవ్వండి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు
విచారణకు హాజరవ్వండి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు

Mahesh Babu: విచారణకు హాజరవ్వండి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించిన నేపథ్యంలో, ఆ సంస్థపై మోసపూరిత ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదులో మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా పేర్కొన్నారు. బాలాపూర్‌లోని ఓ వెంచర్‌కు సంబంధించి మెస్సర్స్‌ సాయి సూర్య డెవలపర్స్‌ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారం నిర్వహించింది. ఇందులో మహేశ్‌బాబు ఫొటోలను ఉపయోగించి బ్రోచర్లను పంపిణీ చేశారు. ఈ వెంచర్‌లో అన్ని అనుమతులున్నాయని పేర్కొంటూ వినియోగదారులను ఆకర్షించింది. అదే నమ్మకంతో ఓ మహిళా వైద్యురాలు, మరో వ్యక్తి ఒక్కో ప్లాట్‌ కోసం రూ.34.80 లక్షలు చొప్పున చెల్లించారు.

Details

మూడో ప్రతివాదిగా మహేష్ బాబు

అయితే, ఆ ప్లాట్లకు సంబంధించి లేఅవుట్‌ అసలే లేదని తాము తర్వాత తెలుసుకున్నామని వారు తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన సమయంలో సంస్థ యజమాని కేవలం రూ.15 లక్షలు మాత్రమేనని, అదీ విడతలుగా, తిరిగి ఇచ్చినట్టు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలంటూ వారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కంపెనీ (మొదటి ప్రతివాది), యజమాని కంచర్ల సతీశ్‌ చంద్రగుప్త (రెండో ప్రతివాది), ప్రచారకర్త మహేశ్‌బాబు (మూడో ప్రతివాది)గా పేర్కొంటూ కేసు దాఖలైంది. విచారణలో హాజరుకావాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.