Sirai: బలగం తరహా ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చిన తమిళ సంచలన క్రైమ్ డ్రామా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన 'బలగం' సినిమా ప్రేక్షకులను ఎంతలా భావోద్వేగానికి గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్థాయిలో హృదయాన్ని తాకే అనుభూతిని తాజాగా తమిళంలో సంచలనం సృష్టించిన చిన్న సినిమా 'సిరై' అందిస్తోంది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ వేదికపై విడుదలైంది. థియేటర్‌కు వెళ్లి స్వయంగా ఈ సినిమాను చూసిన టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫిదా అయ్యారంటే, ఇందులోని భావోద్వేగ లోతు ఎంతగానో అర్థమవుతుంది.
Details
అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీ
ఈ కథ మొత్తం 'కదిరవన్' అనే హెడ్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని కోర్టుకు తరలిస్తున్న సమయంలో అతడు తప్పించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ ఖైదీ అసలు ఎవరు? అతను చేసిన హత్య వెనుక దాగి ఉన్న గతం ఏమిటి? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్‌లా ప్రారంభమయ్యే ఈ ప్రయాణం, క్రమంగా హృదయాన్ని కదిలించే అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీగా మారుతుంది. సహజమైన నేటివిటీ, కళ్లకు కట్టినట్లు అనిపించే సన్నివేశాలతో సాగే ఈ చిత్రం, చివరికి ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది.