Balakrishna: బాలకృష్ణకు అరుదైన గౌరవం.. దిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధాని దిల్లీలో బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026'లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును అందజేశారు. సినీ రంగంలో దశాబ్దాలుగా ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ నిర్వాహకులు ఈ సత్కారం చేశారు. ఈ భారీ కార్యక్రమానికి దిల్లీలోని 'భారత్ మండపం' వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, ప్రముఖ నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
వివరాలు
షర్మిలా ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు అలనాటి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబ సభ్యులు)కూ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిలా ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయసు పెరిగే కొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందని ఆమె తెలిపారు. దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చి 31 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ భాషల సినిమాలను ప్రదర్శించనున్నారు.