అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య టాక్ షో, ఈసారి బాలకృష్ణను వివాదంలో పడేసింది. ఈ మధ్య రిలీజైన ఎపిసోడ్ లో, బాలకృష్ణ మాటలు నర్సులను హర్ట్ చేసాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నర్స్ కమ్యూనిటీ ధర్నాకు దిగింది. నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నర్సులందరూ కలిసి బాలయ్యకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ స్పందించారు. నర్సుల పట్ల తనకు అమితమైన గౌరవం ఉందనీ, బసవతారకం ఆసుపత్రిలో వాళ్ళ కష్టాన్ని దగ్గరి నుండి చూసానని, తన మాటలు నర్సుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలను, వార్తలను ఖండిస్తున్నానని, రాత్రింబవళ్ళు పేషంట్లకు సేవలు చేసే నర్సులంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలియజేశాడు.
సారీ చెప్పిన బాలకృష్ణ
కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నర్సులు పని చేసారని, నర్సులను అగౌరవపర్చాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఒకవేళ తను మాట్లాడిన మాటలు ఇబ్బందికరంగా ఉంటే అందుకు సారీ చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బాలకృష్ణ. దీంతో నర్సుల వివాదం సద్దుమణిగినట్లే అని చెప్పుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షోలో మాట్లాడిన బాలకృష్ణ, నిజాం కాలేజ్ లో చదువుతుండగా తనకు యాక్సిడెంట్ అయ్యిందనీ, దాంతో స్పృహ తప్పిపోయాననీ, తీరా కళ్ళు తెరిచాక హాస్పిటల్ లో ఉన్నాననీ, అక్కడ ఒక నర్స్ అందంగా కనిపించడంతో ఆ హాస్పిటల్లో మరికొన్ని రోజులు ఉండాలనిపించిందని తెలిపారు. ఈ మాటలు నర్సుల కమ్యూనిటీకి చేరాయి. వాళ్ళు ధర్నాకు దిగడంతో బాలకృష్ణ సారీ చెప్పారు.