Band Melam: ఓటీటీలోకి 'బ్యాండ్ మేళం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
'కోర్ట్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. ఈ చిత్రంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి మంచి స్పందన లభించింది. యూత్‌ను ఆకట్టుకునే లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
ఓటీటీలో విడుదల ఎప్పుడంటే..
తెలుగు యూత్‌ఫుల్ మూవీ 'బ్యాండ్ మేళం' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రం ఏప్రిల్ 24 నుంచి జీ5 తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 17న శుక్రవారం జీ5 తమ సోషల్ మీడియా ద్వారా పోస్టర్ విడుదల చేసి వెల్లడించింది. "బ్లాక్‌బస్టర్ జంట మళ్లీ మీ ముందుకు రానుంది. మీరు ఇష్టపడిన ఈ జోడీ మరోసారి అలరించబోతోంది. ఈ సంగీత ప్రయాణానికి సిద్ధమేనా? ఏప్రిల్ 24న 'బ్యాండ్ మేళం' ప్రీమియర్ కేవలం జీ5లో మాత్రమే" అంటూ జీ5 పేర్కొంది.
వివరాలు
థియేటర్ స్పందన ఇదే..
'బ్యాండ్ మేళం' సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రం మార్చి 26న విడుదలైంది. సతీశ్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఇందులో హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, గోపరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
వివరాలు
కథలో మలుపు ఇలా
'కోర్ట్' సినిమాలో మెప్పించిన రోషన్, శ్రీదేవి మరోసారి కలిసి నటించడంతో 'బ్యాండ్ మేళం'పై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో వీరు బావ-మరదళ్లుగా కనిపిస్తారు. యాదగిరి (గిరి), రాజీ చిన్ననాటి నుంచే పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయిస్తారు. గిరికి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. గిరి తన స్నేహితులతో కలిసి గ్రామంలో మ్యూజిక్ బ్యాండ్ ప్రారంభిస్తాడు. మరోవైపు రాజీ ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్తుంది. రాజీ తండ్రి సాయన్న తన కుమార్తెను మరొకరితో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. ఆ తరువాత ఏమవుతుంది? రాజీ ఆ పెళ్లికి అంగీకరిస్తుందా? గిరి ఏ నిర్ణయం తీసుకుంటాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే 'బ్యాండ్ మేళం' సినిమాను చూడాల్సిందే.