Barbie: ఓటీటీలో రిలీజైన బార్బీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హాలీవుడ్ మూవీ బార్బీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1.4 బిలియన్ డాలర్ కలెక్షన్లను వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో 11వేల కోట్లకు పైమాటే. క్రిస్టఫర్ నోలాన్ ఓపెన్ హైమర్ సినిమాతో పాటు రిలీజ్ అయిన బార్బీ చిత్రం, పోటీని తట్టుకుని మరీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను వసూలు చేయగలిగింది. ఈ సినిమాలో మార్గోట్ రాబి బార్బీ పాత్రలో నటించింది. ఇంకా ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. థియేటర్లలో దుమ్ము దులిపిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో విడుదలైంది.
రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతున్న బార్బీ
బార్బీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అమెజాన్ సబ్ స్క్రయిబర్లు బార్బీ సినిమాను డైరెక్టుగా చూడలేరు. దీనికోసం అదనంగా 499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రెంట్ పద్ధతిలో బార్బీ సినిమా అందుబాటులో ఉంది. ఒక్కసారి 499 రూపాయలు చెల్లించిన తర్వాత కేవలం 48 గంటల్లో మాత్రమే సినిమాను చూసేయాలి. ఒకవేళ చూడకపోతే మళ్లీ 499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. మరి సబ్ స్క్రయిబర్లకు ఉచితంగా బార్బీ సినిమాను చూసే అవకాశం ఎప్పటినుండి ఉంటుందనేది ఇంకా తెలియదు.