
PVR Inox: పీవీఆర్ ఐనాక్స్‌పై దావా.. నష్టపరిహారాన్ని చెల్లించాలన్న కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
తన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox), బుక్‌మై షోపై దావా వేసిన వ్యక్తికి రూ. 65,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది. 2023లో ఈ విషయంపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ కేసుపై నిర్ణయం వెలువడింది. 2023లో బెంగళూరుకు చెందిన వ్యక్తి సాయంత్రం 4 గంటల షోకు పీవీఆర్ ఐనాక్స్‌లో సినిమాకు వెళ్లారు. అయితే, సినిమా మొదలయ్యే ముందు 30 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ట్రైలర్లు ప్రదర్శించారు. ఈ కారణంగా సినిమా ప్రారంభం ఆలస్యమై, గణనీయమైన సమయం వృథా అయ్యిందని భావించిన ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
వివరాలు
నష్టపరిహారం చెల్లించడంతో పాటు రూ. 1 లక్ష జరిమానా
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన షో 6:30 గంటలవరకు సాగిందని,దీంతో తన షెడ్యూల్ పూర్తిగా దెబ్బతిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకటనల ప్రదర్శన ప్రేక్షకులకు ఏమీ ప్రయోజనం కలిగించదు కాబట్టి, ఇది అన్యాయమని ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వినియోగదారుల కమిషన్ సమయాన్ని డబ్బుగా పరిగణించాలనే అంశాన్ని గుర్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీవీఆర్ ఐనాక్స్ రూ. 65,000 నష్టపరిహారం చెల్లించడంతో పాటు రూ. 1 లక్ష జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే, బుక్‌మై షో కేవలం టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాబట్టి, ప్రకటనల ప్రసారం సమయంపై దానికి ఎటువంటి బాధ్యత లేదని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల బుక్‌మై షోపై ఎటువంటి జరిమానా విధించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పునిచ్చింది.