భగవంత్ కేసరి రివ్యూ: అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించే బాలయ్య సినిమా
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి భగవంత్ కేసరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ: అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి, తన కూతురు కాని విజయలక్ష్మి అలియాస్ విజ్జీ పాప(శ్రీలీల) కూతురు బాధ్యతలను తీసుకుంటాడు. విజ్జీ పాపను ఆర్మీలో చేర్చాలని అతడు ఆశపడతాడు. ఆ సమయంలో డ్రగ్ లీడర్ రాహుల్ సాంగ్వీ, విజ్జీ పాపకు హాని చేయాలనుకుంటాడు. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు రాహుల్ సాంగ్వీకి, భగవంత్ కేసరికి సంబంధం ఏంటనే విషయాలను వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
ప్లస్ పాయింట్స్ సినిమా మొదలుకావడమే ఆసక్తికరమైన పాయింటుతో మొదలవుతుంది. కథలోకి దర్శకుడు నెమ్మదిగా తీసుకెళ్తాడు. ముఖ్యంగా ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునే అంశం.. బాలయ్య మేకోవర్. బాలయ్య లుక్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. వయసుకు తగిన పాత్రలో బాలయ్య చాలా చక్కగా కనిపించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇక సెకండాఫ్ లో ఫైట్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో శ్రీలీల అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇక బాలయ్య గొంతు నుంచి వినిపించే సందేశాత్మక డైలాగులు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ బాగున్నప్పటికీ సినిమా స్లోగా నడుస్తుందన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఫస్టాఫ్ లో కాజల్ అగర్వాల్ పాత్ర సినిమా కథకు అడ్డు తగిలినట్టుగా అనిపిస్తుంది. భగవంత్ కేసరి సినిమా కథ కొత్తదేం కాదు, చాలా సినిమాల్లో మనం చూసిన కథే. దానివల్ల కొన్ని సీన్లు మనకు ముందుగానే అర్థమైపోతాయి. విలన్ ని మరింత పవర్ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే భగవంత్ కేసరి చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. చిత్ర ప్రమోషన్లలో అనిల్ రావిపూడి చెప్పినట్టు బాలయ్యను సరికొత్త అవతారంలో చూస్తారు.