Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెపై జరిగిన సైబర్ వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ మీడియాకు వెల్లడించారు. తన కుమార్తెపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. బాధితురాలు ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌లో ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025' కార్యక్రమానికి అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివరాలు
విద్యార్థుల్లో అవగాహన పెంచాలి
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై మాట్లాడిన ఆయన, తమ ఇంట్లో జరిగిన ఈ ఘటనను వెల్లడించారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచితుడి నుంచి సందేశం వచ్చిందని, న్యూడ్ ఫొటోలు పంపాలని అతడు అడిగాడని తెలిపారు. ఈ విషయం తన కుమార్తె వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించినట్లు వివరించారు. ఇదే సందర్భంలో పాఠశాల విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు సైబర్ ఎడ్యుకేషన్‌ను వారానికి ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అక్షయ్ కుమార్ కోరిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.