Junior Mehmood : ఫిల్మ్ ఇండస్టీలో వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత
ఫిల్మ్ ఇండస్టీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్(Junior Mehmood) క్యాన్సర్ తో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన 67ఏళ్ల వయస్సులో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మెహమూద్ అసలు పేరు నయీమ్ సయ్యద్. శాంతాక్రూజ్ వెస్ట్ లోని జుహు ముస్లిం శ్మశనవాటికలో మధ్యాహ్నం 12 గంటలకు మహమూద్ అంత్యక్రియలు జరగనున్నాయి. జూనియర్ మెహమూద్ కొన్ని రోజులగా కాలేయం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
1966లో 'మొహబ్బత్ జిందగి'తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను ప్రారంభించిన మెహమూద్
మెహమూద్ మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా నయీమ్ సయ్యద్ 1966లో 'మొహబ్బత్ జిందగి'తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించారు. 1968లో స్టార్ కమెడియన్ మెహమూద్‌తో కలిసి సుహాగ్ రాత్ సినిమాలో నటించిన తరువాత నయీమ్ సయ్యద్.. జూనియర్ మెహమూద్ స్క్రీన్ నేమ్ అందుకున్నారు. కడుపు క్యాన్సర్ వల్ల నయీమ్ మృతి చెందారు. ఇది నాలుగో స్టేజిలో ఉందని, చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యులు పేర్కొన్నారు. ఈ స్టేజిలో కీమోథెరపీ చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంటుందని, ఆయనని ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం. నయీమ్ ఈ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.