బాయ్స్ హాస్టల్ రివ్యూ: వార్డెన్ మరణం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా?
కన్నడలో విజయం అందుకున్న హాస్టల్ హుడుగారు బేకగిద్దరే సినిమాను బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి. ప్రజ్వల్ బీపీ, మంజునాథ నాయక, తేజస్ జయన్న తదితరులు నటించిన ఈ సినిమాను నితిన్ క్రిష్ణమూర్తి తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: బాయ్స్ హాస్టల్ లో ఉండే అజిత్(ప్రజ్వల్), తన స్నేహితులతో కలిసి వార్డెన్(మంజునాథ నాయక) మరణించినట్లు ఒక షార్ట్ ఫిలిమ్ తీయాలని అనుకుంటాడు. అదే సమయంలో అనుకోకుండా వార్డెన్ నిజంగానే మరణిస్తాడు. అజిత్ రూమ్ మేట్స్ పేర్లు రాసి మరీ వార్డెన్ చనిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది? అసలు వార్డెన్ ఎలా చనిపోయాడనేదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా చూస్తున్నంత సేపు మీరు థియేటర్లో ఉన్నట్టుగా కాకుండా బాయ్స్ హాస్టల్ ల్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెరమీద రకరకాల పాత్రల నవ్విస్తూ వెళ్తుంటాయి. నిజానికి ఈ సినిమాలో ఫలానా పాత్ర ప్రధానమని చెప్పడానికి ళేదు. ప్రతీ పాత్ర వచ్చి నవ్విస్తూ ఉంటుంది. సినిమా మొదలైన దగ్గరి నుండి మీ పెదాల మీద నవ్వు కదుల్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మరీ లాజిక్ కి దూరంగా వెళ్ళారేమో అనిపించిన సీన్లు కనిపించినా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే బాయ్స్ హాస్టల్స్ మరీ ఇలా ఉంటాయా అనిపించే సీన్లు కొన్ని కనిపిస్తాయి. ఆ విషయంలో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అనిపిస్తుంది.
ఎవరెలా చేసారంటే?
ఈ సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. వారి వంతుగా అందరూ నవ్విస్తూ వెళ్ళిపోయారు. యాంకర్ రష్మీ తన అందాలతో ఊరించింది. తరుణ్ భాస్కర్ పాత్ర కూడా బాగుంటుంది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తారు. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. తెలుగు ప్రేక్షకులకు తగినట్టుగా సంభాషణలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్. మొత్తంగా చూసుకుంటే బాయ్స్ హాస్టల్ సినిమా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, అలాగే నవ్విస్తుంది.