Vijay -Rashmika Wedding Reception: ఘనంగా విరోష్ వివాహ విందు .. సందడి చేసిన సినీ,రాజకీయ ప్రముఖులు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ తారలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సందడి... వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ఆశీస్సుల మధ్య విరోష్ వివాహ విందు వేడుక కనులవిందుగా సాగింది. గత నెల 26న వివాహ బంధంతో ఒక్కటైన ప్రముఖ సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేదికపైకి వచ్చి అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి, అభివాదం చేశారు.
వివరాలు
కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, రానా, కరణ్ జోహార్, నాని, నాగచైతన్య, రవితేజ, కార్తి, నమ్రత, సితార ఘట్టమనేని, రాధిక, శరత్‌కుమార్, దర్శకులు సుకుమార్, నాగ్ అశ్విన్, శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు విచ్చేశారు.
వివరాలు
తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలొచ్చింది: విజయ్
నాయికలు కృతిసనన్, మృణాల్ ఠాకూర్, కృతిశెట్టి, శ్రీలీల కూడా ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగానికి చెందిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని, అందరి ఆశీస్సులు ఎప్పుడూ తమపై ఉండాలని విజయ్ దేవరకొండ - రష్మిక దంపతులు కోరుకున్నారు. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడింది.
వివరాలు
అందరూ ఆమెను ప్రేమగా చూసుకోవాలి: విజయ్
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చిందని చెప్పి తన భార్య రష్మికను పరిచయం చేశారు. అందరూ ఆమెను ప్రేమగా చూసుకోవాలని కూడా అన్నారు. ఈ మాటలు విన్న రష్మిక సిగ్గుపడుతూ నవ్వుతూ భర్త వెనుకకు వెళ్లారు. తమ జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భమని రష్మిక పేర్కొన్నారు.