Paapam Prathap: 'పాపం ప్రతాప్'కు సెన్సార్ అడ్డంకులు.. యానిమల్ బోర్డు ఎన్ఓసీతో టెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు తిరువూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పాపం ప్రతాప్' సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు అనూహ్య అడ్డంకి ఎదురైంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు తలెత్తడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా, సినిమాలో జంతువుల వినియోగానికి సంబంధించి భారత జంతు సంక్షేమ బోర్డు నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC)ను చిత్ర బృందం సమర్పించకపోవడంతో, సెన్సార్ బోర్డు తుది సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈరోజు సాయంత్రం నుంచి నిర్వహించాల్సిన ప్రీమియర్ షోలపై కూడా అనిశ్చితి నెలకొంది.
వివరాలు
ఆందోళనలో చిత్రయూనిట్
అయితే నిర్మాతలు, ETV Win యాజమాన్యం ప్రస్తుతం అత్యవసరంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సినిమాను సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రూ. 100 టికెట్ ధరతో విడుదల చేయాలని తిరువీర్ ప్రత్యేకంగా ప్రమోషన్లు నిర్వహించాడు. ఇలాంటి కీలక సమయంలో ఈ టెక్నికల్ సమస్యలు రావడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేకర్స్ అవసరమైన పత్రాలను సమర్పించడం లేదా అభ్యంతరకర సన్నివేశాల్లో మార్పులు చేసి సెన్సార్ క్లియరెన్స్ పొందడం జరుగుతుంది. ఇప్పుడు 'పాపం ప్రతాప్' టీమ్ కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.