వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరం: సినిమాను వదిలేయండని రాజకీయ నాయకులపై కామెంట్స్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజైంది. అయితే నిన్నటితో వాల్తేరు వీరయ్య 200రోజులు పూర్తి చేసుకుంది. 200రోజులుగా కొన్ని థియేటర్లలో వాల్తేరు వీరయ్య ఇంకా ప్రదర్శితం అవుతూనే ఉంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరాన్ని చిత్రబృందం జరుపుకుంది. ఈ సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, సినిమా రంగాన్ని చుట్టుకుంటున్న రాజకీయ అంశాలపై మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాడాలనీ, ఉద్యోగాలను ఎలా సృష్టించాలో ఆలోచించాలనీ, రోడ్లు, ప్రాజెక్టులు వంటి విషయాల గురించి ఆలోచించాలని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా రంగం మీద పడకూడదని చిరంజీవి అన్నారు.
200రోజులపై చిరంజీవి సంతోషం
ప్రస్తుతం చిరంజీవి కామెంట్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అదలా ఉంచితే, వాల్తేరు వీరయ్య సినిమా 200రోజులు పూర్తి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలియజేసారు. గతంలో 100, 175, 200రోజుల పాటు సినిమాలు ప్రదర్శితమయ్యేవనీ, ఇప్పుడు రెండు వారాల్లో సినిమా థియేటర్లలోంచి సినిమా వెళ్ళిపోతుందని ఇలాంటి సమయంలో 200రోజుల జ్ఞాపిక తీసుకోవడం ఆనందంగా ఉందనీ, మళ్ళీ పాతరోజులు గుర్తొచ్చాయని అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించింది. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.