Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట.. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు వాడొద్దని ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో కీలక విజయం లభించింది. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు,ఫొటోలు,బిరుదులను ఉపయోగించకుండా నిరోధించాలని కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి,చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను రక్షిస్తూ ఆ ఆదేశాలను విడుదల చేశారు. నిర్ధేశిత ఉత్తర్వుల ప్రకారం,ఆన్‌లైన్ దుస్తుల సంస్థలు,డిజిటల్ మీడియా,యూట్యూబ్ ఛానెల్స్ సహా ఏ సంస్థా అయినా చిరంజీవి పేరు,'మెగాస్టార్','చిరు' వంటి బిరుదులు,ఫొటోలు,వాయిస్‌ని వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదు. కొంతకాలంగా కొన్ని సంస్థలు ఆయన అనుమతి లేకుండా ఆయన గుర్తింపును వాడుతూ లాభం పొందుతున్నారని చిరంజీవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా
దీనివల్ల ఆయన ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆయన కోర్టుకు తెలియజేశారు. చిరంజీవి వాదనలను పరిశీలించిన కోర్టు, ఈ అనధికారిక వినియోగం వల్ల ఆయన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది అందుచేత, ఈ ఉల్లంఘనలను వెంటనే ఆపాలని తాత్కాలిక నిషేధ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల కాలంలో అనేక సినీ ప్రముఖులు తమ వ్యక్తిత్వ హక్కులను రక్షించుకోవడానికి కోర్టులను ఆశ్రయించడం సాధారణం అయింది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్‌లు కూడా తమ పేరు, ఫొటోల వినియోగంపై ఇలాంటి తాత్కాలిక ఆదేశాలను పొందారు.