తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్
తమిళ దర్శకుడు పా రంజిత్, వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తాడని అందరికీ తెలిసిందే. సమాజాన్ని అద్దంపట్టి చూపే సినిమాలను తెరకెక్కించడంలో పా రంజిత్ ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉన్నారు. ప్రస్తుతం పా రంజిత్ నుండి చియాన్ విక్రమ్ హీరోగా తంగలాన్ మూవీ వస్తోంది. తంగలాన్ నుండి ఆల్రెడీ చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదలైంది. ఇందులో విక్రమ్ ని చూసిన వారందరూ మాటలు రాక నోరెళ్ళబెట్టేసారు. చిన్నపాటి గ్లింప్స్ తోనే మరో లోకంలోకి తీసుకెళ్ళాడు పా రంజిత్. ఆ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ తంగలాన్ సినిమా పీరియాడిక్ నేపథ్యం ఉందని ఊహిస్తారు. కానీ విక్రమ్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ అయోమయంలో పడేసింది.
బ్యాక్ టు ద ఫ్యూఛర్ అంటున్న విక్రమ్
తంగలాన్ సినిమా సెట్ లోంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు విక్రమ్. ఆ ఫోటోలకు క్యాప్షన్ పెడుతూ, భవిష్యత్తులోకి మళ్ళీ వెళ్తున్నా అని అర్థం వచ్చేలా వాక్యం రాసాడు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియో గ్లింప్స్ చూస్తే పాతకాలానికి ప్రేక్షకులను తీసుకెళేలా కనిపిస్తుంటే, విక్రమ్ మాత్రం భవిష్యత్తులోకి వెళ్తున్నాను అని ఎందుకు పెట్టాడని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ విషయమై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అదలా ఉంచితే ఈ ఫోటోల్లో కనిపిస్తున్న విక్రమ్ లుక్ చూసి షాక్ ఐపోతున్నారు. బాగా పెరిగిన గడ్డంతో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న తంగలాన్ మూవీ, పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.