LOADING...
Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు
పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది. వీరిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని ఆ సంఘం పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటి వ్యక్తులకు గుడ్డిగా మద్దతు ఇవ్వవద్దని అసోసియేషన్‌ చిత్ర పరిశ్రమను కోరింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

పాకిస్తానీ కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం అంటే.. 

''వారి వ్యాఖ్యలు మన దేశాన్ని అవమానపరచడమే కాకుండా,ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన అమాయకులను,దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయి. మన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న పాకిస్థానీ కళాకారులు,చిత్రనిర్మాతలపై పూర్తి బ్యాన్‌ విధించాలి. భారతీయులు వీరిని అభిమానించవద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అవమానపరచడమేనని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, మన దేశం కోసం ఐక్యంగా నిలబడుదాం'' అని వారు అన్నారు. అదేవిధంగా, భారతీయ గాయనీగాయకులు పాక్‌ సింగర్స్‌తో వేదికలు పంచుకోవద్దని కూడా సూచించారు. జాతీయ ప్రయోజనాలను ప్రాధాన్యంగా చూడాలని వారు కోరారు.

వివరాలు 

9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం..  80 మంది ఉగ్రవాదులు మృతి 

గత నెల ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. మంగళవారం రాత్రి, అందరూ నిద్రపోతున్న సమయంలో, క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభమైంది. ఈ దాడిలో 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించారు.