Manchu Manoj: సినిమాకు కులం లేదు.. మతం లేదు: మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
'గజ' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌పై ప్రశంసలు కురిపించిన ఆయన.. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభమైన విషయం కాదన్నారు. కొత్త టీమ్‌తో ఇలాంటి ప్రయత్నం చేసేందుకు ధైర్యం చేసిన 'గజ' చిత్రబృందాన్ని మనోజ్ అభినందించారు. 'గజ' టీజర్ చాలా బాగా వచ్చిందని, తాను నిజంగా ఇంప్రెస్ అయ్యానని మంచు మనోజ్ తెలిపారు. జీవితంలో ముందుకు సాగాలంటే రిస్క్ తీసుకోవడంతో పాటు.. తీసుకున్న నిర్ణయంపై నమ్మకంతో కష్టపడాలని సూచించారు. ఈ సినిమా కోసం సతీష్ జై దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా మూడు బాధ్యతలు తీసుకుని పనిచేసిన విధానం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
వివరాలు
మణిశర్మతో అనుబంధం గుర్తుచేసుకున్న మనోజ్
'గజ' సంగీత దర్శకుడు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని కూడా మంచు మనోజ్ గుర్తుచేసుకున్నారు.
తన తండ్రి మోహన్‌బాబు నటించిన 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో మణిశర్మ సంగీతాన్ని దగ్గరుండి చూసే అవకాశం తనకు లభించిందని తెలిపారు.
ఇటీవల మణిశర్మ సంగీతం అందించిన 'చెన్నై లవ్ స్టోరీ' కూడా మంచి విజయాన్ని సాధించిందని మనోజ్ పేర్కొన్నారు. 'గజ'తోనూ ఆ విజయ పరంపర కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
వివరాలు
'మనందరిదీ ప్రేమ కులం'
సినిమా పరిశ్రమకు కులం, గోత్రం అంటూ ఏమీ ఉండవని మంచు మనోజ్ అన్నారు. ''కళామతల్లికి కులం లేదు.. మతం లేదు. సినిమా వాళ్లకు, ప్రేక్షకులకు, మీడియాకు మనందరిదీ ఒకటే కులం.. ప్రేమ కులం'' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు.
'గజ' టీజర్ చూస్తుంటే సినిమా చాలా ప్రామిసింగ్‌గా అనిపించిందని పేర్కొంటూ.. చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.