CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తమిళ సినీ రంగానికి కొత్త ఊపిరి!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (CM Vijay) సినీ పరిశ్రమకు భారీ ఊరటనిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని తమిళ చిత్రాలకు విడుదలైన తొలి వారం రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అధికారికంగా అనుమతిస్తూ కొత్త జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం కోలీవుడ్‌కు మరిన్ని అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంలో నిర్వహించే తెల్లవారుజామున ప్రత్యేక షోలకు ఇకపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
వివరాలు
టికెట్ ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్
అంతేకాకుండా సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తమ పెట్టుబడిని త్వరగా రికవరీ చేసుకునేందుకు వీలుగా టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పెద్ద సినిమాలకు మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి లభించేది. దానికోసం నిర్మాతలు ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని తమిళ సినిమాలకు విడుదలైన తొలి వారం రోజులు 5 షోల వెసులుబాటు కల్పించడంతో మొత్తం పరిశ్రమకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది. ఈ విప్లవాత్మక నిర్ణయంతో తమిళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.