Page Loader
Venkatesh: టెలివిజన్ స్క్రీన్‌పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
టెలివిజన్ స్క్రీన్‌పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'

Venkatesh: టెలివిజన్ స్క్రీన్‌పై నవ్వులు పంచనున్న 'సంక్రాంతికి వస్తున్నాం'

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్‌ 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్‌ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్వించింది. కేవలం తెలుగు భాషలోనే విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతూ ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌ కోసం సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలు కూడా థియేట్రికల్ రిలీజ్‌కు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రాగా, రెండు నుంచి మూడు నెలల తర్వాత టెలివిజన్‌లో ప్రసారం అవుతున్నాయి.

Details

మార్చి 1న ప్రసారం

అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' మాత్రం ఓటిటి కంటే ముందుగా టీవీలో ప్రీమియర్ కానుంది. ప్రముఖ ఛానల్ జీ తెలుగు ఈ చిత్రాన్ని ప్రసారం చేయబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన జీ తెలుగు, మార్చి 1న సాయంత్రం 6 గంటలకు 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. అయితే ఓటిటి లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తర్వాత టీవీ టెలికాస్ట్ రేటింగ్స్ భారీగా తగ్గిపోయాయి. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీపై జీ తెలుగు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టెలికాస్ట్‌ ద్వారా మంచి రేటింగ్స్ సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.