Conan O'Brien: వరుసగా మూడోసారి ఆస్కార్ హోస్ట్‌గా కానన్ ఓ'బ్రియన్
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ ప్రముఖ హోస్ట్, కమెడియన్ కానన్ ఓ'బ్రియన్ మరోసారి ఆస్కార్ వేదికపై సందడి చేయనున్నారు. 99వ అకాడమీ అవార్డ్స్‌కు వరుసగా మూడో ఏడాది కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వెరైటీ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అకాడమీ సీఈఓ బిల్ క్రేమర్, అకాడమీ ప్రెసిడెంట్ లినెట్ హోవెల్ టేలర్ మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన డిస్నీ అప్‌ఫ్రంట్ ప్రెజెంటేషన్ సందర్భంగా వెల్లడించారు. 2027 ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం మార్చి 14, 2027న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ వేడుకను అమెరికాలో ABC, Hulu వేదికలపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మార్చి 15 ఉదయం 4.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
వివరాలు
99వ ఆస్కార్ వేడుక మరింత ప్రత్యేకం..
కానన్ ఓ'బ్రియన్‌తో పాటు ఆయన నిర్మాతలు జెఫ్ రాస్, మైక్ స్వీనీ కూడా వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమంలో కొనసాగనున్నారు. మైక్ స్వీనీ ఈ ఈవెంట్‌కు రచయితగానూ వ్యవహరిస్తున్నారు. ఇక రాజ్ కపూర్, కేటీ ముల్లన్ లైవ్ టీవీ ఈవెంట్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నాలుగో ఏడాది కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా బిల్ క్రేమర్, లినెట్ హోవెల్ టేలర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. "కానన్, రాజ్, కేటీ, జెఫ్, మైక్‌లతో మరోసారి కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. 99వ ఆస్కార్ వేడుకను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పని చేయబోతున్నాం" అని పేర్కొన్నారు.
వివరాలు
ట్రావెల్ షోలతో బిజీగా.. కానన్ ఓ'బ్రియన్
కానన్ ఓ'బ్రియన్‌కు అవార్డ్ షోల హోస్టింగ్‌లో మంచి అనుభవం ఉంది. 'లేట్ నైట్ విత్ కానన్ ఓ'బ్రియన్', 'ది టునైట్ షో విత్ కానన్ ఓ'బ్రియన్', 'కానన్' వంటి ప్రముఖ కార్యక్రమాలకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం 'కానన్ ఓ'బ్రియన్ నీడ్స్ ఎ ఫ్రెండ్' అనే పోడ్కాస్ట్, 'కానన్ ఓ'బ్రియన్ మస్ట్ గో' అనే ట్రావెల్ షోలను నిర్వహిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన ఆరు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు గెలుచుకోగా, మొత్తం 33 నామినేషన్లు అందుకున్నారు. అందులో ఆస్కార్‌కు సంబంధించిన నామినేషన్ కూడా ఉంది.
వివరాలు
యూట్యూబ్‌లో 100వ ఆస్కార్ వేడుక..
ఇక రాజ్ కపూర్, కేటీ ముల్లన్ కూడా కానన్‌తో మరోసారి కలిసి పనిచేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. "ప్రేక్షకులు ఇష్టపడే ప్రత్యేక హాస్యాన్ని కానన్ ఈ కార్యక్రమానికి తీసుకొస్తారు. అదే సమయంలో ఆయనలో ఉండే ఆత్మీయత, సానుకూలత మొత్తం షోలో కనిపిస్తుంది. స్టేజ్‌పై మాత్రమే కాదు, బ్యాక్‌స్టేజ్‌లో కూడా ఆయనతో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది" అని తెలిపారు. ఇదిలా ఉంటే, ఆస్కార్ ప్రసార హక్కులు డిస్నీ వద్ద 2028 వరకు మాత్రమే ఉన్నాయి. 100వ ఆస్కార్ వేడుక తర్వాత ఈ కార్యక్రమం యూట్యూబ్‌కు మారనుంది. అలాగే 2029 నుంచి లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లోని పీకాక్ థియేటర్‌లో ఆస్కార్ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.