Darshan : చికిత్స కోసం బెంగళూరులో దర్శన్.. అభిమానులతో తూముకూరులో ఉద్రిక్తతలు
కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ, వెన్నునొప్పి సమస్యతో బెంగళూరులోని కంగేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దర్శన్ వెంట భార్య విజయలక్ష్మి ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ఆయనకు వైద్య కారణాలపై ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, దర్శన్ వెన్ను, ఎడమ కాలి నొప్పితో బాధపడుతున్నారు. ఎడమ కాలు బలహీనంగా ఉండడంతో చికిత్స కోసం మునుపటి ఎంఆర్ఐ రిపోర్టులు అందకపోవడంతో మళ్లీ ఎంఆర్ఐ, ఎక్స్ రే వంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉంటే చేస్తారు, లేకపోతే ఫిజియోథెరపీ మొదలుపెడతామని ఆయన చెప్పారు.
శస్త్ర చికిత్స కోసం అనుమతి కోరిన దర్శన్ తరుపు లాయర్
అతనికి మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స కోసం అనుమతి కోరినట్లు దర్శన్ తరపు లాయర్ తెలిపారు. బళ్లారి జైలు వైద్యుల సీల్డ్ మెడికల్ రిపోర్టులతో పాటు న్యూరాలజీ విభాగ నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. అక్టోబర్ 30న విడుదలైన దర్శన్ తూముకూరులోని తన భార్య ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా అభిమానులు గుమికూడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. దర్శన్ కుమారుడు వినీష్ అభిమానులను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అభ్యర్థించారు, కోర్టు షరతులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.