తెలుగు సినిమా దర్శకులపై ధనుష్ ఫోకస్: విరాట పర్వం దర్శకుడితో కొత్త సినిమా?
తమిళ హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ధనుష్ చేతిలో మరో తెలుగు ప్రాజెక్ట్ చేరబోతుందని వినిపిస్తోంది. ఆ ప్రాజెక్టుకు తెలుగు దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడని టాక్. నీది నాది ఒకే కథ, విరాట పర్వం చిత్రాల దర్శకుడు వేణు ఊడుగుల, ధనుష్ తో సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడట. వేణు చెప్పిన కథ నచ్చిందని, ధనుష్ ఓకే చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ఎక్సైటింగ్ గా ఉండనున్న ప్రాజెక్టు
సెన్సిబుల్ దర్శకుడు వేణు ఊడుగులతో ధనుష్ సినిమా ఉంటుందంటే అదేదో కొత్తగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వేణు ఊడుగుల తీసిన రెండు సినిమాలు కూడా చాలా సెన్సిబుల్ సినిమాలు. నీది నాది ఒకే కథ సినిమా, యువతకు బాగా నచ్చింది. విరాట పర్వం కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేక పోయినా విమర్శకుల ప్రశంసలు గెల్చుకుంది. పై రెండు సినిమాల తరహాలో ధనుష్ తో సినిమా చేస్తే దాని లెవెల్ వేరేగా ఉంటుందని అనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. అదలా ఉంచితే, ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో ధనుష్ నటిస్తున్నాడు. అరుణ్ మాథీశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.