LOADING...
Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం
ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం

Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
06:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాలు తదితర రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఐదుగురికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ లభించగా, 13 మందికి పద్మభూషణ్‌, 113మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో 19 మంది మహిళలు ఉండగా, ఆరుగురు విదేశీయులు లేదా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. అలాగే 16 మందికి మరణానంతరం ఈ గౌరవాలు దక్కాయి.

Details

పద్మవిభూషణ్

పద్మవిభూషణ్‌ అవార్డు పొందిన వారిలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్‌ (మరణానంతరం), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌. అచ్యుతానందన్‌ (మరణానంతరం), క్లాసికల్‌ వయోలిన్‌ విద్వాంసుడు ఎన్‌. రాజం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.టి. థామస్‌, ప్రముఖ రచయిత పి. నారాయణన్‌ ఉన్నారు.

Details

పద్మభూషణ్

పద్మభూషణ్‌ జాబితాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌, పారిశ్రామికవేత్త ఉదయ్‌ కోటక్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి భగత్‌ సింగ్‌ కోష్యారి, అడ్వర్టైజింగ్‌ రంగానికి చెందిన వెటరన్‌ పియూష్‌ పాండే (మరణానంతరం), సామాజిక నాయకుడు వెల్లపల్లి నటేసన్‌, టెన్నిస్‌ ఐకాన్‌ విజయ్‌ అమృతరాజ్‌ చోటు దక్కించుకున్నారు. వైద్య రంగంలో కల్లిపట్టి రామస్వామి పళనిస్వామికి, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి, సామాజిక సేవల విభాగంలో ఎస్కేఎం మైలనందన్‌కు, కళల విభాగంలో శతావధాని ఆర్‌. గణేష్‌కు పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించారు. వీరితో పాటు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సొరెన్‌, వికే మల్హోత్రాలకు కూడా ఈ గౌరవం దక్కింది.

Advertisement

Details

పద్మశ్రీ

పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవితా పునియా, రెజ్లర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భుల్లార్‌ ఉన్నారు. కళారంగానికి సంబంధించి నటుడు ప్రోసేన్‌జిత్‌ ఛటర్జీ, శాస్త్రీయ గాయని త్రిప్తి ముఖర్జీ, తరుణ్‌ భట్టాచార్య, పోఖిల లెక్తేపి, ఆర్‌. మాధవన్‌లతో పాటు తెలుగు నటులు మురళీ మోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌లను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అధికారికంగా ప్రదానం చేయనున్నారు.

Advertisement