ఆ రెండు సినిమాల విడుదల వాయిదా వెనుక దిల్ రాజు?
రెండు మూడు రోజులుగా దిల్ రాజు వర్సెస్ అల్లు అరవింద్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, దిల్ రాజు ల సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఇలా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని, గీతగోవిందం కాంబినేషన్ అయిన పరశురామ్, విజయ్ దేవరకొండల సినిమా గురించి మాట్లాడతారని వినిపించింది. కానీ, అలాంటిదేదీ జరగలేదు. అయినా కూడా ఇప్పటికీ దిల్ రాజు, అల్లు అరవింద్ ల మధ్య సంబంధాలు కొద్దిగా దెబ్బతిన్నాయనే మాటలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఐతే మరికొంతమందేమో అలాంటిదేమీ లేదని, అల్లు అరవింద్ కోసమే ఫిబ్రవరిలో విడుదలవ్వాల్సిన సినిమాలను దిల్ రాజు వాయిదా వేయించారని అంటున్నారు.
ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన శాకుంతలం, ధమ్కీ చిత్రాలు వాయిదా
సమంత ముఖ్య పాత్రలో నటించిన శాకుంతలం, విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ.. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కావాల్సినవి. కానీ సడెన్ గా వేరు వేరు కారణాల వల్ల ఇవి రెండూ వాయిదా పడ్డాయి. రిలీజ్ పోస్ట్ పోన్ అవడానికి కారణం దిల్ రాజు అని, అల్లు అరవింద్ జీఏ2 పిక్చర్స్ నుండి వస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు మేలు చేసేందుకే ఆ రెండు సినిమాలను వాయిదా వేసారని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ మూవీ, ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.