గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ మధ్య గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పిన విజయ్, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలియజేసాడు. ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నిర్మాతగా ఉండనున్నాడు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు.. ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, విజయ్ తో సినిమా మొదలవుతుందని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. దీంతో ఈ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి కలిగింది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.
ఫ్యామిలీ సెక్షన్లకు ఆకట్టుకునే అన్ని హంగులున్న సినిమా
దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాలన్నీ ఫ్యామిలీ సినిమాలే. కుటుంబ మొత్తం వచ్చిచూసే విధంగా సినిమాలు తీర్చిదిద్దుతాడని దిల్ రాజుకు పేరుంది. ప్రస్తుతం పరశురామ్, విజయ్ కాంబినేషన్లోని మూవీ కూడా అన్ని రకాల హంగులతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమచారం. ఈ విషయమై పూర్తి సమాచారం బయటకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారాలు జోరందుకుంటున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలని విజయ్ ప్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే ఖుషీ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఉంది. అదీగాక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మరి విజయ్ - పరశురామ్ మూవీ ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో!