
Dhanush: ఏఐతో 'రాంఝనా' క్లైమాక్స్ మార్పుపై.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ధనుష్ టీమ్!
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'రాంఝనా' సినిమా ఇటీవల మళ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ రీ రిలీజ్ పరంపరలో ఓ సంచలన అంశం చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ భాగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో మార్చి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే నటుడు ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌లు స్పందించగా, తాజా సమాచారం మేరకు వీరిద్దరూ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై దర్శకుడు ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, క్లైమాక్స్‌ను ఇలా ఎడిట్ చేయడం తనను తీవ్రంగా బాధించిందన్నారు.
వివరాలు
మా సృజనాత్మకతను దెబ్బతీసినట్లే..
ఇలాంటి మార్పులు భవిష్యత్తులో మరిన్ని గందరగోళాలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ''ఇలాంటి మార్పుల ప్రభావం నా ఇతర సినిమాలపై కూడా పడవచ్చనే భయం ఉంది. ధనుష్ కూడా ఈ పరిణామాన్ని చూసి చాలా కలత చెందారు. మా కృషి, సృజనాత్మకతను దెబ్బతీసినట్లే అవుతుంది. అందుకే మేమిద్దరం ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం,'' అని ఆయన స్పష్టం చేశారు. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం,ధనుష్‌కి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అప్పట్లో 'ఇరోస్ ఇంటర్నేషనల్' సంస్థ విడుదల చేసింది.
వివరాలు
స్పందించిన ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ
తాజాగా అదే సంస్థ ఈ సినిమాని తమిళ భాషలో ఈ నెల 1న మళ్లీ విడుదల చేసింది. అయితే, ఈసారి క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చేశారు. అసలు కథలో కనిపించిన విషాదాంత ముగింపును, ఏఐ సాయంతో సంతోషంగా ముగిసే ఎండింగ్‌గా మార్చి ప్రదర్శించారు. ఈ మార్పుపై ధనుష్, ఆనంద్‌లు తీవ్రంగా ఆక్షేపించారు. ఇదిలా ఉండగా, దీనిపై సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా స్పందించింది. తమ ప్రతినిధి ఈ మార్పును ధనుష్ బృందంతో ముందుగానే చర్చించిందని, కానీ అప్పట్లో వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సంస్థ పేర్కొంది.