LOADING...
Bharathiraja: ఓ దర్శక శిఖరం అస్తమించింది.. భారతీరాజా జ్ఞాపకాల్లో సినీలోకం
ఓ దర్శక శిఖరం అస్తమించింది.. భారతీరాజా జ్ఞాపకాల్లో సినీలోకం

Bharathiraja: ఓ దర్శక శిఖరం అస్తమించింది.. భారతీరాజా జ్ఞాపకాల్లో సినీలోకం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 10, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా, హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుల్లో భారతీరాజా అగ్రగామిగా నిలిచారు. పల్లె వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం, ప్రేమలు, బంధాలు, సంతోషాలు, విషాదాలు వంటి భావోద్వేగాలను ఆయన తన చిత్రాల్లో ఎంతో సహజంగా ప్రతిబింబించారు. ఆయన రూపొందించిన ప్రతి చిత్రం మట్టివాసన వెదజల్లే జీవన కథలా ప్రేక్షకుల హృదయాలను తాకింది. ప్రేమను కవిత్వంగా, ప్రకృతిని కథలో భాగంగా మలచిన ఆయన సినిమాలు తరతరాల ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందుకే భారతీరాజా కేవలం దర్శకుడిగానే కాకుండా భావోద్వేగాలను దృశ్యరూపంలో చెప్పగల అసాధారణ కథకుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

వివరాలు

సహాయ దర్శకుడిగా ప్రారంభమైన ప్రయాణం..

1941 జూలై 17న తేని జిల్లాలోని అల్లి నగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, సినీ రంగంలో స్థిరపడటం ఆయనకు అంత సులభం కాలేదు. ప్రముఖ దర్శకులు పుట్టణ్ణ కనగల్, పి. పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తూ సినీ నిర్మాణంలోని పలు మెళకువలను నేర్చుకున్నారు. అదే ఆయన సినీ జీవితానికి బలమైన పునాది అయింది.

వివరాలు

మేకప్ లేకుండా సినిమా షూట్..

1977లో విడుదలైన '16 వయతినిలే' చిత్రం ద్వారా భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ అయ్యింది. అప్పటి వరకు స్టూడియోలకు మాత్రమే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించి కొత్త మార్గాన్ని సృష్టించారు. హీరోలను మేకప్ లేకుండా, సహజ రూపంలో చూపించడం, గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా ఉండే కథానాయికలను పరిచయం చేయడం ద్వారా అప్పటి సినీ సంప్రదాయాలకు భిన్నమైన శైలిని తీసుకొచ్చారు.

Advertisement

వివరాలు

తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు..

గ్రామీణ కథలతోనే కాకుండా, 'సిగప్పు రోజాక్కల్' (తెలుగులో 'ఎర్ర గులాబీలు') వంటి సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలతో తన వైవిధ్యాన్ని నిరూపించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం 'సీతాకోకచిలుక' (1981) అప్పట్లో విశేష ఆదరణ పొందింది. కుల వివక్షను ప్రశ్నిస్తూ తెరకెక్కించిన 'వేదం పుదిదు' చిత్రం సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి తదితర ప్రముఖ నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.

Advertisement

వివరాలు

'ఆమె' అందానికి మంత్రముగ్ధుడై...

భారతీరాజా చిత్రాల్లో గ్రామీణ నేపథ్యం ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. పల్లె సౌందర్యాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కథానాయికలను కూడా సహజసిద్ధమైన అందంతోనే చూపించేవారు. దీనికి కారణం ఏమిటని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎంతో ఆసక్తికరంగా ఉండేది. "ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. ఆమె కోసం వెతుకుతూ వెళ్లిన ప్రతిసారి ఆమె నాకు పల్లెల్లోనే కనిపించేది. ఆమె ఎంతో అందంగా ఉండేది. కానీ ఆమె ఓ వ్యక్తి కాదు... ఆమె పేరు 'ప్రకృతి'. ఆ ప్రకృతి అందానికి నేను ముగ్ధుడిని అయ్యాను. అందుకే కెమెరా చేతిలో పట్టుకుని ఆ అందాన్ని వెతుకుతూనే ఉంటాను" అంటూ గ్రామీణ జీవితం, ప్రకృతిపై తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు.

వివరాలు

పురస్కారాలతో నిండిన ప్రస్థానం..

భారతీరాజా ప్రతిభకు అనేక అవార్డులు, గౌరవాలు లభించాయి. దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయనకు 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక శిఖరం) అనే గౌరవ బిరుదు లభించింది. వివిధ విభాగాల్లో మొత్తం ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. వీటిలో 'సీతాకోకచిలుక' చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2004లో భారత ప్రభుత్వం ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారం ప్రదానం చేసింది. అదనంగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, ఆరు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, పలు నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో చేరాయి.

వివరాలు

నటుడిగానూ ప్రశంసలు..

దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా తన ప్రతిభను చాటుకున్నారు. 'ఆయుధ ఎళుతు', 'పాండియనాడు', 'తిరుచిత్రంబలం' (తెలుగులో 'తిరు'), అలాగే గతేడాది విడుదలైన విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్' చిత్రంలో ఆయన చివరిసారిగా ప్రేక్షకులకు కనిపించారు. అలాగే ఆయన నటించిన 'పులవర్' చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. నటుడిగా అది ఆయన చివరి చిత్రం కానుంది.

వివరాలు

భావితరాల కోసం సంస్థ స్థాపన..

సినిమాపై ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ అందించాలనే ఉద్దేశంతో భారతీరాజా 'భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సినిమా (BRIIC)'ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థులకు సినీ రంగంలోని పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ప్రజల ముందుకు వచ్చిన ప్రతిసారి "నా ప్రియమైన తమిళ ప్రజలారా" అంటూ ఆప్యాయంగా పలకరించే భారతీరాజా ఇక లేరనే వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణంతో భారతీయ చిత్రసీమలో ఒక స్వర్ణయుగానికి ముగింపు పలికినట్లైంది. అయితే ఆయన చిత్రాలు, ఆలోచనలు, కళాత్మక దృష్టి మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతూనే ఉంటాయి.

Advertisement