
Brahmanda Movie: తన సినిమా ప్రివ్యూ చూస్తుండగానే దర్శకుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే జానపద కళల్లో ఒగ్గు కథకు ప్రత్యేక స్థానం ఉంది. 'ఒగ్గు' అంటే శివుడి చేతిలో ఉండే డమరుకం. ఈ పదం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. అలాంటి ప్రాచీన కళా రూపాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా 'బ్రహ్మాండ' - ఈ చిత్రాన్ని దాసరి సురేశ్ నిర్మించగా, ఎస్. రాంబాబు తన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సినిమా ప్రివ్యూ చూస్తుండగా రాంబాబు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. రాంబాబును మిత్రులు ప్రేమగా నగేష్ అని పిలిచేవారు.
Details
బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి
మొదటి సినిమాతోనే గొప్ప విషయాన్ని చెప్పాలన్న ఆ డైరెక్టర్ ఈ విధంగా అకస్మాత్తుగా మృతిచెందటం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన తన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రాన్ని స్క్రీన్‌పై ఆసక్తిగా వీక్షిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారని సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం,వెంటనే మరణించటం విషాదకరం. బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన అల్లీపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 'బ్రహ్మాండ' టీజర్‌ను ఇటీవల దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. ఈ చిత్రంలో బన్నీ రాజు హీరోగా నటించగా, ఆమని, జయరామ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
Details
60 టీవీ సీరియళ్లకు కో-డైరెక్టర్ పనిచేసిన అనుభవం
ఒగ్గు కథల పునర్జీవానికి ప్రతిరూపంగా నిలవనున్న ఈ సినిమాతో దర్శకుడు రాంబాబు గొప్ప ప్రయోగం చేశారు. కానీ ఇది ఆయన తొలి చిత్రమే కాకుండా చివరిది కూడా కావడం తండ్రి వంటి గురువులకు, మిత్రులకు కలతను కలిగించింది. రాంబాబు గతంలో సుమారు 150 సినిమాలకు, 60 టీవీ సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ఈటీవీలో ప్రసారమైన 'అంతరంగాలు', 'అన్వేషణ' వంటి పాపులర్ సీరియళ్లకు కూడా ఆయన సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయనలోని కళాత్మక దృక్పథానికి ఈ సినిమా ప్రతిఫలంగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ అంతలోనే ఆయన మరణించడంతో ఆ మూవీ టీం విషాదంలో మునిగిపోయింది. నిర్మాత దాసరి సురేశ్, నటులు బలగం జయరామ్, ఆనంద్ బాల్సద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.