భారీ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి వస్తున్న 'హనుమాన్': ప్రశాంత్ వర్మ నమ్మకం అదేనా?
అ!, కల్కి, జాంబీరెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. తెలుగులో పెద్దగా మార్కెట్ లేని తేజ సజ్జాతో పాన్ ఇండియా మూవీ ఏంటని మొదట్లో అంతా ఆశ్చర్యపోయారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాకే అసలు విషయం అర్థమయ్యింది. టీజర్ లో గ్రాఫిక్స్, విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి నుండి హనుమాన్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి అన్నీ కుదిరితే ఈ సంవత్సరం మే నెలలోనే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనులు పూర్తి కావడంతో సినిమాను వాయిదా వేసారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు
హనుమాన్ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించారు. 2024సంక్రాంతి సందర్భంగా, ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఓజీ, రవితేజ ఈగిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ చిత్రాల నడుమ హనుమాన్ ని తీసుకురావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే టీజర్ కారణంగా ఏర్పడిన పాజిటివిటీ, హనుమంతుడిని సూపర్ హీరోగా చూపించడం వంటి అంశాలు కలిసి వస్తాయని, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయన్న ఉద్దేశ్యంతో రిస్క్ తీసుకోవాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడని వినికిడి. మరేం జరుగుతుందో చూడాలి.