Game Changer: గేమ్ ఛేంజర్ నుండి రేపు రిలీజ్ కానున్న 'నానా హైరానా'
స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఆయన సినిమాలు మాత్రమే కాకుండా పాటలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జెంటిల్ మెన్ నుంచి ఇండియన్ 2 వరకు, సినిమా బడ్జెట్ ఎంత విస్తృతంగా ఉంటుందో, పాటల బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటే శంకర్ పాటలు గుర్తుకువస్తాయి. పాటల లొకేషన్లు, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్ అన్నీ అద్భుతమైన రీతిలో ఉంటాయి. తాజాగా గేమ్ ఛేంజర్ లో కూడా అదే స్థాయిలో పాటలు ఉండబోతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఈ పాటల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది.
అద్భుతమైన లొకేషన్స్‌లో సాంగ్ షూట్
ఇప్పటికే విడుదలైన "జరగండి","రా మచ్చా" పాటలను భారీ సెటప్‌లో చిత్రీకరించారు. అయితే అవి శంకర్ స్థాయికి కొంత తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఇక ఇప్పుడు అసలైన శంకర్ మార్క్ సాంగ్ రాబోతోందట.తమన్ అందించిన ట్యూన్ ఈసారి ప్రత్యేకంగా ఉండబోతోందని సమాచారం. "నానా హైరానా" అంటూ సాగే మూడవ సింగిల్ ప్రోమో విడుదల కాగా,ఇది భారీ అంచనాలను పెంచింది. సూపర్ మెలోడీగా ఉండే ఈ పాటను ప్రముఖ గాయకులు కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడారు. రామ్ చరణ్,కియారా అద్వానీలపై న్యూజిలాండ్‌లో అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. నవంబర్ 28న ఈ లిరికల్ సాంగ్ విడుదల కానుంది.ఈ సాంగ్ ఖచ్చితంగా శంకర్ స్టైల్‌కు తగిన విధంగా ఉంటుందన్న నమ్మకం అందరిలో ఉంది.
అమెరికాలో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్
గేమ్ ఛేంజర్ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో, అమెరికాలో భారీ స్థాయిలో నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మన దేశంలో ఈ ఈవెంట్ మరింత ఘనంగా ఉంటుందనడంలో సందేహం లేదు. విడుదల ఆలస్యం కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.