LOADING...
Tollywood : కోట్ల ఆస్తులు ఉన్నా… చివరికి బస్టాండ్‌లో అనాథగా ముగిసిన నటి జీవితం!
ఆ నటికి కోట్ల ఆస్తులు..కానీ బస్టాండులో అనాథ శవం!

Tollywood : కోట్ల ఆస్తులు ఉన్నా… చివరికి బస్టాండ్‌లో అనాథగా ముగిసిన నటి జీవితం!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 11, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమె ఒక ప్రముఖ నటి. ఒకప్పుడు కోట్ల విలువైన ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఆమెకు సహజం. కానీ చివరికి జీవనోపాధి కోసం ఇతరుల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, బస్టాండ్ దగ్గర అనాథ శవంలా ఆమె మృతి చెందిందనే వార్తలు వినిపించాయి. సినిమా పరిశ్రమలో కమెడియన్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, సునీల్ లాంటివి. మహిళా హాస్యనటులలో కోవై సరళ పేరు ముందుంటుంది. అయితే అప్పట్లోనే తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించిన పలువురు నటీమణులు ఉన్నారు. ఆ కాలంలో ప్రత్యేక గుర్తింపు పొందిన లేడీ కమెడియన్ గిరిజ. ఆమె తెలుగులో స్టార్ ఇమేజ్ పొందిన తొలి మహిళా హాస్యనటిగా కూడా గుర్తింపు పొందింది.

వివరాలు

ఆ సినిమాలు నిర్మించి ముందుకు..

'పాతాళ భైరవి' చిత్రంలో తోట రాముడిని చూసి "నరుడా, నీ కోరిక ఏమిటి?" అని చెప్పిన ఒక్క డైలాగ్ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సినిమాలో ఆమె దేవత పాత్రలో కనిపించింది. తరువాత కూడా అనేక తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఆమెకు మంచి ఆస్తులు, ఖ్యాతి, అవకాశాలు అన్నీ లభించాయి. సహాయం కోరిన వారికి తిరస్కరించకుండా తోడ్పడే స్వభావం కూడా ఆమెకు ఉంది. కానీ వివాహం తర్వాత ఆమె జీవితంలో మార్పులు వచ్చాయి. తిరుపతిలో సన్యాసిరావు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 'భలే మాస్టారు', 'పవిత్ర హృదయాలు' వంటి సినిమాలు నిర్మించింది.

వివరాలు

అప్పుల బారిన పడి..దారుణ స్థితి..

అయితే ఆ చిత్రాలు విజయం సాధించకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. భర్త అధిక వ్యయాలు, మద్యం అలవాటు, దౌర్జన్య ప్రవర్తన వల్ల కుటుంబం ఇబ్బందులు పడింది. చివరికి సంపాదించిన ధనం మొత్తం ఖర్చు చేసి, ఒకరోజు ఆయన ఇంటిని వదిలి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన గిరిజ, తరువాత అప్పుల బారిన పడి చెన్నైలో చిన్న గదిలో నివసించాల్సి వచ్చింది. రోజువారీ ఖర్చుల కోసం కూడా పరిచయస్తుల వద్ద నుంచి రూ.50, రూ.100 వరకు అడిగే పరిస్థితి ఏర్పడింది. డ్యాన్స్ మాస్టర్ సురేష్ దాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గిరిజ చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొని తన దగ్గర కూడా సహాయం కోరిందని తెలిపారు.

Advertisement

వివరాలు

చివరి చూపు చూడని సినీ వర్గం..

కొన్ని రోజుల తర్వాత ఆమె బస్టాప్ దగ్గర మరణించినట్టు తెలిసి తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. సీనియర్ నటి వై.విజయ కూడా గిరిజ తన ఇంటికి వచ్చి ఖర్చుల కోసం డబ్బులు అడిగేదని గుర్తుచేసుకున్నారు. గిరిజ మరణంపై ఆమె కుమార్తె శ్రీగంగ వేర్వేరు వివరాలు వెల్లడించింది. ఆమె ప్రకారం, గిరిజ బస్టాండ్ వద్ద కాకుండా ఇంట్లోనే మరణించింది. ఆమె మరణవార్త తెలిసినా చివరి చూపు కోసం ఎవరూ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు కోట్ల ఆస్తులతో జీవించిన గిరిజ, చివరికి ఆర్థికంగా పూర్తిగా క్షీణించింది. నటుడు శోభన్ బాబు మాత్రం ఫోన్ ద్వారా ఆమె కుమార్తెకు ధైర్యం చెప్పారు. తదుపరి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించినట్లు సమాచారం.

Advertisement