Malleswari: చైనాలోనూ సంచలనం సృష్టించిన తెలుగు క్లాసిక్ 'మల్లీశ్వరి'.. అప్పట్లోనే పాన్ వరల్డ్ రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం "పాన్ ఇండియా" సినిమాలు పెద్ద ఎత్తున రూపొందుతున్నప్పటికీ, దాదాపు 1950ల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. అలాంటి అపూర్వమైన క్లాసిక్‌లలో 1951లో విడుదలైన మల్లీశ్వరి ఒకటి. మహానటుడు నందమూరి తారక రామారావు, భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బి. ఎన్. రెడ్డి దర్శకత్వం వహించారు. వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1951 డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా, అప్పటి తెలుగు సినిమాల శైలిని కొత్త దిశగా మలిచింది. ఎన్టీఆర్, భానుమతి నటనతో పాటు వారి మధ్య కనిపించిన భావోద్వేగ అనుబంధం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
మల్లీశ్వరి కథ ఏంటంటే..
ఈ చిత్ర కథ విజయనగర సామ్రాజ్య కాలానికి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న సమయంలో వీరాపురం అనే గ్రామంలో కథ ఆరంభమవుతుంది. కళలు, శిల్పాలు, నేసిన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ఆ ఊరిలో నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్నప్పటి నుంచే ఎంతో సన్నిహితంగా పెరుగుతారు. కాలక్రమేణా వారి అనుబంధం ప్రేమగా మారుతుంది. అయితే మల్లీశ్వరి తల్లి భూష్యేంద్రమణి వారి ప్రేమను అంగీకరించకుండా, ఆమెను రాణివాసానికి పంపిస్తుంది. జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో నాగరాజు సంపాదన కోసం ఊరు విడిచి వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి మల్లీశ్వరి రాజభవనానికి వెళ్లిపోయిందని తెలుసుకుని విరహవేదనతో దేశాంతరాలకు చేరుకుంటాడు.
వివరాలు
ప్రేమ, త్యాగాలను చూపే కథ..
తర్వాత శిల్పకళలో తన ప్రతిభను చాటుకున్న నాగరాజు, శ్రీకృష్ణదేవరాయల వసంత మండప నిర్మాణంలో ప్రధాన శిల్పిగా నియమితుడవుతాడు. అతను రూపొందించిన శిల్పాల్లో మల్లీశ్వరి ప్రతిరూపాన్ని గుర్తించిన ఆమె, రహస్యంగా నాగరాజును కలుస్తుంది. చివరికి రాణి తిరుమలాంబ సహకారంతో వారి ప్రేమ, త్యాగాలను గుర్తించిన రాయలు వారిని క్షమించి కలుపుతారు. కథలో చోటుచేసుకునే భావోద్వేగ మలుపులు ప్రేక్షకులను ఆఖరి వరకు కట్టిపడేస్తాయి.
వివరాలు
చైనాలో 100 రోజులు ఆడిన సినిమా..
ఈ చిత్రానికి కథ మాత్రమే కాకుండా సంగీతం కూడా ప్రధాన బలంగా నిలిచింది. సినిమాలోని 17 పాటల్లో 16 పాటలను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రచించగా, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. "నెలరాజా వెన్నెలరాజా", "మనసున మల్లెల మాలలూగెనే", "అవునా నిజమేనా" వంటి గీతాలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. మల్లీశ్వరి పాత్రలో భానుమతి, నాగరాజు పాత్రలో ఎన్టీఆర్ అద్భుత నటన కనబరిచారు. 1951 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పట్లో 13 కేంద్రాల్లో వరుసగా 71 రోజులు ప్రదర్శించబడింది. చైనాలో సబ్‌టైటిల్స్‌తో విడుదలై 100 రోజులపాటు ప్రదర్శించబడిన తొలి తెలుగు చిత్రంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
A still from the movie Malliswari, 1951#NTR I #Bhanumathi I #BNReddy pic.twitter.com/qsnIljIBjV
— TeluguCinemaHistory (@CineLoversTFI) November 8, 2019