LOADING...
Soundarya: సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు
సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు

Soundarya: సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అపూర్వ నటి సౌందర్య గురించి నటుడు సురేష్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమెతో ఉన్న తన దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సౌందర్య వ్యక్తిత్వం, సినిమా ప్రయాణం గురించి హృదయపూర్వకంగా మాట్లాడారు. ఒక హీరోయిన్ ఎలా ఉండాలో చెప్పాలంటే సౌందర్యనే ఉదాహరణగా చూపించవచ్చని ఆయన అన్నారు. ఆమె దుస్తులు, నడవడి, సంస్కారం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు.

వివరాలు

తొలి చిత్రం 'అమ్మోరు'..

సౌందర్య తొలి చిత్రం 'అమ్మోరు' అని సురేష్ తెలిపారు. ఆ సినిమాకోసం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆమెను బెంగళూరులో నుంచి ఎంపిక చేశారని చెప్పారు. ఆ సమయంలో ఆమెకు సుమారు 16 లేదా 17 ఏళ్లు ఉంటాయని, కానీ వయసు గురించి ఎప్పుడూ అడగలేదని అన్నారు. 'అమ్మోరు' చిత్రీకరణ సమయంలో ఆమె చాలా వినయంగా, ఉత్సాహంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రతి సన్నివేశం పూర్తయ్యాక "సార్, బాగుందా? కరెక్టేనా?" అంటూ అడిగేదని తెలిపారు. తనను సీనియర్ నటుడిగా ఎంతో గౌరవించేదని సురేష్ చెప్పారు. 'అమ్మోరు' సినిమా పూర్తయ్యాక, తన రెండో సినిమా విడుదలయ్యేలోపే సౌందర్య ఎనిమిది సినిమాలు పూర్తి చేసి టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వివరాలు

సౌందర్యతో హీరోగా, విలన్‌గా చేసిన నటుడు

అనంతరం తాను ఆమెతో హీరోగా కూడా నటించానని, 'దొంగాట' చిత్రంలో విలన్ పాత్రలో కనిపించానని తెలిపారు. అలాగే వెంకటేష్, సౌందర్యతో కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి పుత్రుడు' చిత్రంలో నటించిన విషయాన్ని గుర్తుచేశారు. 'అమ్మోరు' సమయంలో ఎలా ఉండేదో, 'దేవి పుత్రుడు' వరకు కూడా ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సురేష్ అన్నారు. చాలా మంది పేరు, స్థాయి, పారితోషికం పెరిగేకొద్దీ మారిపోతారని, కానీ సౌందర్య మాత్రం ఎప్పటికీ అలానే ఉండేదని చెప్పారు. ఇది ఒక హీరోయిన్‌గా సాధించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ "బాగున్నారా అండి? ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా?" అని అడిగేదని తెలిపారు. ఆమె ఆత్మీయత తనకు ఎంతో నచ్చేదని అన్నారు.

Advertisement

వివరాలు

ఆమె నవ్వుకు ఫిదా

సౌందర్య తనకు అత్యంత ఇష్టమైన విషయం ఆమె సహజమైన నవ్వు అని సురేష్ చెప్పారు. ఆ నవ్వు పక్కింటి అమ్మాయిలా, గ్రామీణ సౌందర్యంతో మెరిసే అమాయకత్వంతో ఉండేదని వివరించారు. ఆమె కళ్లలో ఎప్పుడూ ఉత్సాహం, జీవం కనిపించేదని అన్నారు. తాను మాట్లాడుతుంటే ఆమె చూపు ఎక్కడికైనా వెళ్లిపోతే, సరదాగా "హలో... నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు" అని చెప్పేవాడినని గుర్తుచేసుకున్నారు. జీవితంపై ప్రేమ, ఉత్సాహం ఉండేదని, అదే ఆమె నటనలోనూ కనిపించేదని అన్నారు. అలాంటి జీవితాన్నిప్రేమించిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని సురేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో రెండు సందర్భాల్లో మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నానని, అవి శ్రీహరి మరణం, సౌందర్య మరణం సమయంలోనే అని చెప్పారు.

Advertisement

వివరాలు

సౌందర్య పోలికలతో కూతుర్లు..

శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ మరొక రూపంలో తిరిగి పుడుతుందనే తత్వం తనకు ఉందని తెలిపారు. అందుకే కుటుంబ సభ్యుల మరణాల సమయంలో కూడా అంతగా విచారించలేదని, కానీ శ్రీహరి, సౌందర్యలను దేవుడు చాలా తొందరగా తీసుకెళ్లడం అన్యాయంగా అనిపించిందని అన్నారు. ఇటీవల సౌందర్య భర్త రఘుతో మాట్లాడినట్టు సురేష్ వెల్లడించారు. ఆయన మళ్లీ వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలకు తండ్రయ్యారని తెలిపారు. ఆ చిన్నారుల్లో సౌందర్య మళ్లీ పుట్టినట్టుగా ఉందని తాను చెప్పగా, రఘు కూడా వారు సౌందర్య పోలికలతో అచ్చం ఆమె లాగానే ఉన్నారని ఆనందంగా చెప్పారని సురేష్ వివరించారు.

Advertisement