Family Pack Teaser: 'గుర్తింపు కథలు వద్దురా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. శ్రీ విష్ణు అదిరిపోయే పంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు, 'సామజవరగమన' ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. ఈ హిట్ కాంబో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్ తాజాగా విడుదలైంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. అయితే చివర్లో శ్రీ విష్ణు చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాాలు
టీజర్ చివర్లో అదిరిపోయే పంచ్!
టీజర్ చివర్లో శ్రీ విష్ణు ఓ రైటర్‌ను ఉద్దేశించి ''ఏ రైటరో.. ఏం కథ రాస్తున్నావురా?'' అని అడుగుతారు. అందుకు పోలీస్ స్టేషన్ రైటర్ ''గుర్తింపు కథ సార్'' అని సమాధానమిస్తాడు.
వెంటనే శ్రీ విష్ణు.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు రేయ్! ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాయండి.. ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలంటూ పంచ్ వేస్తారు.
ఇటీవల కాలంలో వస్తున్న 'గుర్తింపు' నేపథ్య సినిమాలను ఉద్దేశించి వేసిన ఈ సెటైర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలు
స్వార్థపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ విష్ణు
ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాధారణంగా బాధ్యతగల ఫ్యామిలీ మ్యాన్‌గా కాకుండా.. తన కుటుంబం గురించి ఏమాత్రం పట్టించుకోని స్వార్థపరుడిగా ఆయన పాత్రను రూపొందించారు.
ఒక ఇంట్లో బంజారాహిల్స్, బోరబండ ఉంటే ఎలా ఉంటుందో మా ఇల్లు అలా ఉంటుందంటూ తన కుటుంబంలోని జీవనశైలి వ్యత్యాసాలను వివరించే సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.
ఇలాంటి స్వార్థపరుడైన పోలీస్ అధికారి జీవితంలోకి అతడి పై అధికారి కూతురు రావడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఆ తర్వాత జరిగే గందరగోళం, కామెడీ ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు రామ్ అబ్బరాజు.
శ్రీ విష్ణు తన సహజమైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు.
వివరాలు
శ్రీ విష్ణు, వీకే నరేశ్ కాంబోలో నవ్వుల సందడి
ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి మధోల్కర్ అందంగా కనిపించింది.
ఇక శ్రీ విష్ణు, వీకే నరేశ్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు మరోసారి ప్రేక్షకులను నవ్వించనున్నాయి.
శ్రీ విష్ణు తల్లిగా అభిరామి, తమ్ముడిగా బుల్లిరాజు, సాక్షి తండ్రిగా మురళీ శర్మ తమ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
వివరాలు
గ్రాండ్‌గా 'ఫ్యామిలీ ప్యాక్' నిర్మాణం
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. జె. యువరాజ్ కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ అందించగా.. చైతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ సంగీతం సినిమాకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
అనిల్ పసల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి, బలవంతంగా ఇరికించిన కామెడీ కాకుండా సహజమైన సన్నివేశాలతోనే వినోదాన్ని పంచేలా 'ఫ్యామిలీ ప్యాక్' రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
2027 సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తుందో చూడాలి.