బాలీవుడ్ లో విషాదం: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య
బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన నితిన్ దేశాయ్, కజ్రిన్ నవీముంబై లోని తన ఎన్ జీ స్టూడియోలో ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణం ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ విషయంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో వచ్చాయి. బాలీవుడ్ దిగ్గజాలైన విదు వినోద్ చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ, అశుతోష్ గోవారికర్ దర్శకుల సినిమాలకు నితిన్ దేశాయ్ పనిచేసారు. జోధా అక్బర్, లగాన్, దేవ్ దాస్, వన్స్ అపాన్ ఎ టైన్ ఇన్ ముంబై, బాజీరావ్ మస్తానీ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా నితిన్ దేశాయ్ పనిచేసారు.
ఆర్ట్ డైరెక్షన్ లో నాలుగు జాతీయ పురస్కారాలు
ఆర్ట్ డైరెక్షన్ లో నాలుగు జాతీయ పురస్కారాలను నితిన్ దేశాయ్ అందుకున్నారు. నితిన్ దేశాయ్ చివరగా పనిచేసిన చిత్రం పానిపట్ 2019లో విడుదలైంది. నితిన్ దేశాయ్ దర్శకుడిగానూ అవతారమెత్తారు. 2011లో ఆయన దర్శకత్వం వహించిన జైహింద్ సినిమా విడుదలైంది. ఆర్ట్ డైరెక్టర్ గా మాత్రమే కాదు నిర్మాతగా మారి దేశ్ దేవి మా ఆషాపురా సినిమాను 2003లో తెరకెక్కించారు. అలాగే టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి రాజా శివ్ ఛత్రపతి అనే సీరియల్ ను నిర్మించారు. తన కెరీర్లో ఎన్నో గొప్ప శిఖరాలను అందుకున్న నితిన్ దేశాయ్, 58సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు.