
Fish Venkat: మరింత క్షీణించిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం కుమార్తె విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారిందని, ఎదుటివాళ్లను గుర్తు పట్టలేని స్థాయికి చేరిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకట్‌కు కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని, లేకపోతే ప్రాణాలు ముప్పులో పడతాయని వైద్యులు స్పష్టంగా తెలిపారు. ఈ విషయం గురించి వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. ప్రస్తుతం తాము వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలని స్రవంతి కోరుతున్నారు.
వివరాలు
పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం
గత కొన్ని నెలలుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. అప్పట్లో డయాలసిస్ చికిత్సను కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్యం మరింత దిగజారడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. ఇంతకుముందు కూడా వెంకట్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించి, ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి మద్దతుగా నిలిచారు.