Akkineni Naga Chaitanya Birthday : జోష్ నుంచి తండేల్ వరకు..కూల్ అండ్ కామ్‌గా ఉండే నాగచైతన్య ప్రస్థానమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని నాగ చైతన్య.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని రెండు అగ్ర కుటుంబాలకు చెందిన వారసుడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు తెరపై హీరోగా అడుగుపెట్టారు. తండ్రి వైపు నుంచే కాకుండా.. తల్లి వైపు నుంచి కూడా ఆయనకు బలమైన సినీ నేపథ్యం ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడిగా, నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్ మేనల్లుడిగా చైతన్యకు సినిమా కుటుంబంతో అనుబంధం ఉంది. అందుకే ఆయన జీవితం మొదటి నుంచీ ప్రేక్షకులకు పరిచయమే.
వివరాలు
సినీ నేపథ్యం నుంచి వ్యక్తిగత జీవితం వరకు..
నాగచైతన్య కథానాయకుడిగా వెండితెరపైకి రాకముందే తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి తెలుసు. తండ్రి, తల్లి ఇద్దరివీ సినిమా కుటుంబాలు కావడం, ఆ తర్వాత వారిద్దరూ విడిపోవడంతో అప్పుడప్పుడు చైతన్య పేరు చర్చల్లోకి వచ్చేది.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల జయాపజయాలతో ఆయన వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సమంతతో వివాహం, విడిపోవడం వంటి పరిణామాలు కూడా చైతన్య పేరును మరింతగా వార్తల్లోకి తీసుకొచ్చాయి.
చైతన్య జీవితం తెరిచిన పుస్తకంలా కనిపించినప్పటికీ.. అందులో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులకు తెలిసి ఉండొచ్చు.
మరికొన్ని తెలియకపోవచ్చు. ఉదాహరణకు సమంతతో విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అందుకు కారణమేంటన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
వివరాలు
చిరునవ్వుతోనే సమాధానం.. ప్రశాంతతే ఆయన బలం
సాధారణంగా ప్రతి మనిషిలోనూ నవరసాలు ఉంటాయి. సంతోషం, కోపం, దుఃఖం వంటి భావాలను సందర్భాన్ని బట్టి వ్యక్తపరుస్తుంటారు.
సెలబ్రిటీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్నిసార్లు అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ నాగచైతన్య విషయంలో మాత్రం అలాంటి ఘటనలు కనిపించవు. ఆయన వ్యక్తిత్వమే ఎక్కువగా మాట్లాడుతుంది.
చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉండటం చైతన్య ప్రత్యేకత. ఆయన చిరునవ్వు ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది.
బహిరంగంగా ఎప్పుడూ కోప్పడిన సందర్భాలు కనిపించవు.చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వారు చాలామంది ఉంటారు.
వారు సినీ ప్రముఖులైనా, సామాన్యులైనా ఈ విషయంలో చైతన్య నుంచి నేర్చుకోవాల్సింది ఉంది.
ఎవరెంత కవ్వించినా ఓపిగ్గా సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్యమైన లక్షణాలు.
వివరాలు
రొమాంటిక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు
సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం కూడా ఇందుకు ఒక కారణమై ఉండొచ్చు.
అయితే ఆ తర్వాత వచ్చిన 'ఏ మాయ చేసావె'తో ఆయన ప్రేక్షకులను మాయ చేశారు. అక్కినేని కుటుంబ హీరోలకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ను చైతన్య కూడా కొనసాగించారు.
ఆయన ప్రేమకథలు, రొమాంటిక్ సినిమాలు చేసిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. '100 పర్సెంట్ లవ్', 'మనం', 'ప్రేమమ్', 'లవ్ స్టోరీ' 'తండేల్' చిత్రాలు మంచి వసూళ్లతో పాటు ప్రశంసలు అందుకున్నాయి.
ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందిన 'రారండోయ్ వేడుక చూద్దాం', 'వెంకీ మామ', 'మజిలీ', 'బంగార్రాజు' సినిమాలు కూడా విజయాలు సాధించాయి.
వివరాలు
ప్రయోగాలకు సైతం సిద్ధమంటున్న చైతన్య
. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం చైతన్యకు ఉన్న ప్రత్యేక సామర్థ్యం. అవసరమైతే స్కూల్ లేదా కాలేజ్ విద్యార్థిగానూ తెరపై కనిపించగలరు.
ప్రస్తుతం వృషకర్మ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నటుడిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న నాగచైతన్య.. ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.
మరో హీరో అయితే హిందీ సినిమా 'లాల్ సింగ్ చడ్డా'లోని పాత్రను చేయడానికి సందేహించేవారేమో! కానీ హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పటికీ చైతన్య ఆ సినిమాలో నటించారు.
ఇప్పుడు చైతన్య కూడా తండ్రి బాటలోనే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా అడుగులు వేస్తున్నారు. నటుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. నాగచైతన్యకు ఆల్ ది బెస్ట్!