
Gaurav Bora: మిరాయ్‌లో శ్రీరాముడిగా మెరిసిన గౌరవ్ బోరా.. ఎవరు ఈ యువ నటుడు?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన పోషించిన ఆ పాత్రలోని తేజస్సు, ఆహార్యం, అభినయం - ఇవన్నీ కలిసి ఆయనను శ్రీరాముడికి సమానంగా నిలబెట్టాయి. ఆయన తప్ప మరెవరూ ఆ పాత్రకు సరిపోరనే స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఇటీవలి కాలంలో హిందూ మైథాలజీ ఆధారంగా సినిమాలు తెరకెక్కించే ట్రెండ్ పెరుగుతోంది. అదే తరహాలో వచ్చిన తాజా చిత్రం 'మిరాయ్'. తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకెళ్తోంది.
Details
'మిరాయ్'లో శ్రీరాముడి సీన్ ప్రభావం
ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆ సీన్ వచ్చిన వెంటనే థియేటర్లు మొత్తం 'జై శ్రీరామ్' నినాదాలతో మారుమ్రోగాయి. ప్రేక్షకులు ఆ సన్నివేశానికి, దాన్ని ప్రదర్శించిన తీరుకి బలంగా కనెక్ట్ అయ్యారు. అప్పటినుంచి అందరికీ ఒకే ప్రశ్న - శ్రీరాముడిగా కనిపించిన నటుడు ఎవరు? ఉత్తరాఖండ్ నుంచి టాలీవుడ్ వరకూ గౌరవ్ బోరా జర్నీ ఆ నటుడు మరెవరో కాదు.. గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్‌లోని ఖతీమాకు చెందిన ఆయన, డెహ్రాడూన్‌లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. కానీ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో న్యూ ఢిల్లీలో ఐదు సంవత్సరాల పాటు 'కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్, రాస్ థియేటర్ గ్రూప్'లో థియేటర్ నటుడిగా పని చేశారు.
Details
నేషనల్ వైడ్ గుర్తింపు
తర్వాత షార్ట్ ఫిల్మ్స్, హిందీ టీవీ సీరియల్స్‌తో పాటు పలు ప్రముఖ ప్రకటనల్లో నటించారు. వాటిలో బజాజ్ ఫ్రీడమ్, టీవీయస్ ఐ క్యూబ్, సపోలా ఆయిల్, టాటా క్యాపిటల్, ఆక్వాగార్డ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ ప్రయాణంలో 'మిరాయ్' సినిమా ఆయన కెరీర్‌కు మలుపు తిప్పింది. శ్రీరాముడి పాత్ర ద్వారా గౌరవ్ బోరా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఈ సక్సెస్‌తో ఆయనకు మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.