Godari Gattupaina Telugu Movie Review: 'గోదారి గట్టుపైన' రివ్యూ.. పల్లె ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయకపోవడంతో చిన్న సినిమాలకే ప్రేక్షకుల దృష్టి మళ్లింది. చాలా చిత్రాలు జూన్‌కు వాయిదా పడటంతో మే నెల మొత్తం చిన్న సినిమాల హవానే కనిపిస్తోంది. ఆ జాబితాలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గోదారి గట్టుపైన. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. "కూల్ అయిపోండి" అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలకు ముందే ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
వివరాలు
కథేంటంటే..
రాజు (సుమంత్ ప్రభాస్) ఓ ఆటోడ్రైవర్. పదో తరగతితోనే చదువు మానేసి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తల్లి, తండ్రి, చెల్లెలు, స్నేహితులే అతని ప్రపంచం. తన చెల్లెలితో కలిసి ఇంజినీరింగ్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్)ను చూసి ప్రేమలో పడతాడు.
మాయ కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే మాయ తండ్రి శ్యాంబాబు (Jagapathi Babu) తన కూతురంటే ప్రాణంగా భావిస్తాడు.
సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే అతడు, తన కూతురికి తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరగాలని కోరుకుంటాడు.
అలాంటి పరిస్థితిలో ఇంజినీరింగ్ చదువుతున్న తన కూతురు ఓ ఆటోడ్రైవర్‌ను ప్రేమిస్తోందని తెలిసిన తర్వాత శ్యాంబాబు ఎలా స్పందించాడు? ప్రేమను అంగీకరించాడా? లేక తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిపించాలనుకున్నాడా?
వివరాలు
ఎలా ఉందంటే..
రాజు ఎందుకు పోలీస్ లాకప్ వరకు వెళ్లాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో తండ్రి-కూతురు అనుబంధం, యువజంట ప్రేమ ప్రధానాంశాలుగా నిలుస్తాయి. చిత్రబృందం చెప్పినట్టుగానే ఈ సినిమా వేసవిలో చల్లని గాలిలా అనిపించే ప్రయత్నం చేసింది. గోదావరి ప్రాంతపు గ్రామీణ వాతావరణం, పాటలు, అందమైన విజువల్స్, స్థానిక యాస, స్వచ్ఛమైన హాస్యం సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అయితే కథ, కథనం చాలా వరకు ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే సాగడం కొంత నిరాశ కలిగిస్తుంది. దర్శకుడు తొలుత పాత్రల పరిచయంపైనే ఎక్కువ సమయం తీసుకుని, మెల్లగా కథలోకి తీసుకెళ్తాడు.
వివరాలు
నన
హీరో-హీరోయిన్ల పరిచయం నుంచి ప్రేమ, ముద్దు వరకు వెళ్లే ప్రయాణమే ప్రథమార్థంలో ఎక్కువ భాగం ఆక్రమిస్తుంది.
ప్రేమకథలకు కీలకమైన సంఘర్షణ మాత్రం బలంగా కనిపించదు. కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతూ ధారావాహికలను గుర్తు చేస్తాయి.
సుదర్శన్, హీరో కలిసి వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. ఇక శ్యాంబాబు పాత్రను మిస్టీరియస్‌గా చూపించడం వల్ల ద్వితీయార్థంపై ఆసక్తి పెరుగుతుంది.
ఆ పాత్ర నేపథ్యం వల్ల కథ ఎటు మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ద్వితీయార్థంలో కొన్ని మలుపులు కథకు ఊపును తీసుకొస్తాయి.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
పిల్లలు తమ జీవితాల్లో జరిగే విషయాలను తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలిగేలా పెంపకం ఉండాలని, ప్రేమకు కులమతాలు అడ్డుకావని సినిమా చెప్పే సందేశం ఆకట్టుకుంటుంది.
ఆటోడ్రైవర్లను సమాజం చూసే విధానంపై చెప్పిన అంశాలు కూడా చాలామందికి కనెక్ట్ అవుతాయి.
సుమంత్ ప్రభాస్ ఆటోడ్రైవర్ రాజు పాత్రలో ఉత్సాహంగా నటించాడు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఉన్న పాత్ర కావడంతో నటనకు మంచి అవకాశమే దొరికింది.
కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగాలు, డాన్స్‌లోనూ తన ప్రతిభ చూపించాడు. నాయిక నిధి ప్రదీప్ పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉంది. ఆమె తెరపై సహజంగా కనిపించింది.
వివరాలు
జగపతి బాబు పాత్ర అద్భుతం
మహాలక్ష్మి పాత్రలో కనిపించిన రీనూ తన అందంతో ఆకట్టుకుంది. సుదర్శన్ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
అతడు తన గ్యాంగ్‌తో కలిసి వచ్చే సన్నివేశాల్లో మంచి వినోదం అందించాడు. జగపతిబాబు-లైలా జోడీ కొత్తగా అనిపించినా, దర్శకుడు వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన లైలాకు నటనకు పెద్దగా అవకాశమే దక్కలేదు.
భయపడుతూ, అప్పుడప్పుడు సీరియస్‌గా కనిపించే ఆమె పాత్ర చివరికి పెద్దగా ప్రభావం చూపదు. అయితే జగపతిబాబు పాత్ర క్లైమాక్స్‌లో ప్రభావవంతంగా నిలుస్తుంది.
చాలా రోజుల తర్వాత ఆయన ఇలాంటి తండ్రి పాత్రలో కనిపించారు. రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించారు.
వివరాలు
సాంకేతికంగా..
సాంకేతిక విభాగాల్లో ఎడిటింగ్ మినహా మిగిలిన విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. పాటలు బాగుండగా, చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది.
నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తండ్రి ప్రేమ, స్వార్థం వంటి భావోద్వేగాలను స్పృశించే మంచి కథాంశాన్ని దర్శకుడు ఎంచుకున్నప్పటికీ, దాన్ని కొత్తగా చూపించడంలో మాత్రం పూర్తిగా విజయవంతం కాలేకపోయాడు.
అయితే కొన్ని సంభాషణలు మాత్రం బాగా మెప్పిస్తాయి.
వివరాలు
బలాలు
పల్లెటూరి నేపథ్యం
అక్కడక్కడా వచ్చే హాస్యం
పతాక సన్నివేశాలు
బలహీనతలు
ఊహించగలిగే కథ, కథనం
సాగదీతగా అనిపించే ప్రథమార్థం
చివరగా..
గోదారి గట్టుపైన ఒక చల్లని గ్రామీణ ప్రేమకథలా సాగుతుంది.
భావోద్వేగాలు, హాస్యం, సందేశం కలగలిపిన ఈ సినిమా కొంత వరకు ఆకట్టుకున్నా, నెమ్మదైన కథనం కారణంగా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
మొత్తంగా చూస్తే.. "కొంచెం చల్లగా.. కొంచెం వేడిగా!" అనిపించే చిత్రం.