Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ విజయవంతం!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యుల వివరాల ప్రకారం.. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ (Quadriceps Tendon) గాయాన్ని సరిచేయడానికి ఈ శస్త్రచికిత్స చేపట్టారు. ఆపరేషన్ మొత్తం విజయవంతంగా ముగిసిందని, శస్త్రచికిత్స సమయంలో ఎలాంటి వైద్యపరమైన సమస్యలు తలెత్తలేదని వారు స్పష్టం చేశారు.
వివరాలు
బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
ఇటీవల కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కుతున్న 'NBK111' సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ ఓ భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొంటుండగా ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది.
వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.