Tollywood : అమరావతివైపు టాలీవుడ్ దృష్టి..త్వరలో షిఫ్టింగ్. నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో టాలీవుడ్ విస్తరణ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఆ సమయంలోనే నవ్యాంధ్రలో టాలీవుడ్ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆ ఆలోచనలు అమలులోకి రాలేకపోయాయి. ఇప్పటికే అమరావతికి ఏపీ రాజధానిగా చట్టబద్ధ స్థానం దాదాపు ఖరారవుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖుల దృష్టి మళ్లీ ఆ దిశగా మళ్లుతున్నట్లు సమాచారం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన తేదీలను కూడా పరిశ్రమ పెద్దలు సమన్వయం చేస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది.
వివరాలు
అమరావతికి స్టూడియోలు..
ఈ భేటీలో అమరావతిలో ఫిల్మ్ సిటీ నిర్మాణం, స్టూడియోల ఏర్పాటు, ప్రొడక్షన్ హౌసుల స్థాపన వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కార్యకలాపాలు ఏపీలో విస్తరించడం ద్వారా అక్కడ సినిమా షూటింగ్‌లు పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానున్నారని సమాచారం. పవన్ కల్యాణ్ స్వయంగా సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో, పరిశ్రమ ఎదుర్కొనే సమస్యలపై ఆయనకు అవగాహన ఉండటం ఈ సమావేశానికి ప్రత్యేకతను తీసుకువస్తోంది. పలువురు నిర్మాతలు, అగ్ర హీరోలు పెట్టుబడులు పెట్టి ఫిల్మ్ సిటీలు, స్టూడియోలు ఏర్పాటు చేసి అమరావతిని ప్రముఖ సినిమా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.